Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

- Advertisement -

జిల్లాలో డీజేకు అనుమతి లేదు
మత పెద్దలతో శాంతి సమావేశం
కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా  అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో కలిసి శాంతి కమిటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు అధికారులు వివిధ అంశాలపై సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో ఉత్సవాలను నిర్వహించాలనీ, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ఉత్సవాలను పురస్కరించుకొని చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి  హిందూ సమాజ సమితి ఉత్సవ కమిటీ  గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ తీగలు, కేబుల్స్ సవరణ వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత 50 సంవత్సరాల నుండి శాంతియుత వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు.

గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నాయని భద్రతాపరమైన చర్యలకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల వివరాలను తెలియజేయాలని, టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మండపాలు ప్రతిష్టించాలని సూచించారు. మండపాల వద్ద డీ.జే సౌండ్లను నిషేదించడం జరిగిందని , మండపాల వద్ద భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. 

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

మండపాల వద్ద రాత్రి సమయంలోనూ నిర్వాహకులు తప్పనిసరిగా బస చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెన్స్, తాగునీరు, బారికేడ్స్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, టాయిలెట్స్, పారిశుధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో శోభాయాత్రలో పాల్గొనే వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జన యాత్ర కొనసాగే ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు వంటివి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించాలని, ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

చెరువులు,  పరీవాహక ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు సందర్భంగా మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.  ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరు సంయమనం పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల్లో సానిటేషన్ జరగాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని, మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద  సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, సబ్ కలెక్టర్ యువరాజ్, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమ శ్రీ, మున్సిపల్ కమీషనర్ సివిఎన్ రాజు, విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చవాన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హన్మండ్లు, రాళ్ళబండి మహేందర్, వివిధ పార్టీల నాయకులు, మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad