నవతెలంగాణ- రాయపోల్
రైతులు వ్యవసాయ సాగులో రసాయన ఎరువులు, యూరియా వాడకం విరివిగా అవుతుందని వాటికి బదులు సహజ ఎరువులు, నానో యూరియాను ఉపయోగించి లాభసాటిగా అధిక దిగుబడులు పొందవచ్చని గజ్వేల్ ఏడిఏ బాబ్ నాయక్ అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో మహిళ రైతు గూని లక్ష్మీ ప్రత్తి పంటపై నానో యూరియా పిచికారి చేసి నానో యూరియా వాడకం, ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా – ముఖ్యమైన అంశాలు వివరించారు.
ప్రయోజనాలు:
నైట్రోజన్ వినియోగ సామర్థ్యంను గణనీయంగా పెంచుతుందన్నారు.
మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, మరియు నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు.
సాధారణ యూరియాపై ఆధారాన్ని తగ్గించి, వ్యయాన్ని తగ్గిస్తుందన్నారు.
పర్యావరణహితం – నైట్రోజన్ లీచింగ్ తగ్గి మట్టి మరియు నీటి కాలుష్యం తగ్గుతుందన్నారు.
వినియోగ విధానం:
ప్రధాన పంట దశల్లో వాడితే మెరుగైన ఫలితాలు అందుతాయి. (ఉదాహరణకు: తొలకరి, పుష్పించు దశ)
1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీ లీటర్లు మోతాదులో స్ప్రే చేయాలన్నారు.
ప్రతి పంట కాలంలో 2 సార్లు ఉపయోగించడం ఉత్తమమన్నారు.
అనుకూల పంటలు:
వరి, గోధుమ, పత్తి, మక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు, మరియు నూనె గింజలు వంటి పంటలు ఉంటాయన్నారు.
అదనపు సమాచారం:
500 మిల్లీ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక యూరియా బస్తాకు సమానం. వ్యవసాయ రంగం నుంచి వచ్చే హరిత గృహ వాయువుల ఉద్గారాలు తగ్గించడంలో సహాయపడుతుందని వివరించారు. యూరియా వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కావున రైతులు యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.