– తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎముల యాదగిరి..
నవతెలంగాణ- రాయపోల్
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎముల యాదగిరి అన్నారు. గురువారం రాయపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పోరాటాల త్యాగాల చరిత్ర అని, 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది, మలిదశ ఉద్యమంలో 1200 మంది రాష్ట్ర సాధనలో అమరులయ్యారన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు చిత్రమైపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందన్నారు.
ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఉద్యమకారులకు 250 గజాలలో ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు 30 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది ఉద్యమకారులలో సగం మందికే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సాయం చేసిందని, మిగతా ఉద్యమకారులకు ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. 100 ఎకరాలలో అమరవీరుల స్మృతిమనం ఏర్పాటు చేయాలన్నారు. అమరుల కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు అందజేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.
ఉద్యమకారుల కుటుంబాలకు 50 శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల వ్యాపార నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలన్నారు.రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వహించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించి సాంస్కృతిక పాలసీని ప్రకటించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో అమరవీరులకు గుర్తుగా స్మారక భవనం నిర్మించాలన్నారు. ఉద్యమకారులకు 20 లక్షల సామాన్య ప్రమాద బీమా సహకారం కల్పించాలన్నారు.ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలలక్ష్మి, లింగారెడ్డి, చిత్తార, దోసల ధనలక్ష్మి, ప్రశాంత్, కాసారం కృష్ణగౌడ్, జర్నలిస్ట్ పుట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES