పలుచోట్ల వాగ్వాదం.. తోపులాటలు
మహబూబాబాద్ జిల్లాలో లైన్‌లో సొమ్మసిల్లిన రైతుకు గాయాలు
నవతెలంగాణ – విలేకరులు
యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఏదో ఒక మండలంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బహిరంగ మార్కెట్‌లో యూరియా కొరత కారణంగా వ్యాపారులు ఇతర పెస్టిసైడ్ మందులకు లింకు పెడుతూ యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో రైతులు యూరియా కోసం సహకార సంఘాల వైపు పరుగులు పెడుతున్నారు. చెన్నారావుపేట సహకార సంఘంలో గురువారం యూరియా అందుబాటులో ఉందని తెలుసుకున్న పరిసర గ్రామాల రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. చెన్నారావుపేట ఎస్‌ఐ రాజేష్ రెడ్డి ప్రతి ఒక్కరికీ యూరియా అందే విధంగా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్కితండా గ్రామపంచాయతీ మల్లమ్మకుంట తండాకు చెందిన అజ్మీరా లక్క- విజయ దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకలేదు. గురువారం యూరియా ఇస్తున్నారని తెలిసి భార్యాభర్తలిద్దరూ స్థానిక ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద లైన్లో నిలబడ్డారు. లక్క లైన్‌లో ఉండగానే సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయైంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు. బుధవారం రాత్రి యూరియా లారీ వచ్చి సొసైటీ కార్యాలయం దగ్గర ఆగిందన్న సమాచారం అందడంతో వందలాది మంది రైతులు వచ్చారు. చెప్పులు లైన్‌లో పెట్టి తమ వంతు కోసం ఎదురు చూశారు. పోలీసులు బందోబస్తు కల్పించారు. 300 బస్తాల యూరియా పంపిణీ చేశారు. మిగతాది రాగానే సమాచారం ఇస్తామని అధికారులు రైతులకు సర్ది చెప్పారు.
పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి ఒక లోడు (330 బస్తాలు) యూరియా రావడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులను లైన్‌లో పంపించారు. రైతుకు ఒక బస్తా చొప్పున వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్, బ్యాంకు సిబ్బంది పంపిణీ చేశారు.
నకిరేకల్ మండలం తాటికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం ఏడు గంటలకు 330 బస్తాలను పీఏసీఎస్ గోదాంలో అన్‌లోడింగ్ చేశారు. పోలీసుల బందోబస్తు మధ్యలో 10 గంటలకు రైతులకు పంపిణీ చేశారు. అందరికీ అందకపోవడంతో తెల్లవారుజామున వచ్చినా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రైతులకు, పీఏసీఎస్ అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు వచ్చారు. యూరియా నిల్వలు లేవని తెలియడంతో ఆగ్రహంతో రోడ్డుపై రాస్తారోకో చేశారు. గంట తర్వాత పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పీఏసీఎస్ వద్ద పెద్దఎత్తున రైతులు యూరియా కోసం లైన్‌లో నిలుచున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్‌లో వేచి ఉన్నా ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని, ఇది తమకు దేనికీ సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.
యూరియా కోసం బారులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES