విపక్షాలను అణచివేసే చర్య
చట్టపరమైన విధానాలను తప్పించుకునేందుకు ఎత్తుగడలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తిప్పికొట్టాలి..
కామ్రేడ్ దొంగల కోటయ్య సంస్మరణ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశానికి, ప్రజలందరికీ ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్.. చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన గురువారం స్థానిక టేకులపల్లి గోశాల సమీపంలో జరిగిన దొంగల కోటయ్య సంస్మరణ సభలో తమ్మినేని ప్రసంగించారు. దొంగల కోటయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలతో 30 రోజులపాటు కస్టడీలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి నైనా పదవిలో నుంచి తీసివేసే బిల్లును కేంద్రం పార్లమెంట్ లో బుధవారం ప్రవేశపెట్టిందన్నారు. నేరం రుజువై ఐదేండ్లపాటు శిక్షపడే అవకాశం ఉండే సెక్షన్‌లు ఉన్న కేసులో నిందితులు ఎవరైనా 30 రోజులపాటు బెయిల్ లేకుండా జైల్లో ఉంటే పదవి నుంచి తొలగించొచ్చని తెలి పారు. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటమే లక్ష్యం గా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు.
ప్రతిపక్షాలను అణచివేసే చర్య
ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 30 రోజుల కస్టడీ బిల్లు అని తమ్మినేని తెలిపారు. బీజేపేతర పార్టీలు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ కక్షపూరితంగా వ్యవహరించేందుకు ఈ బిల్లు ఓ అస్త్రంలాంటిదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలోనూ నాయకులపై సంబంధిత సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయొచ్చన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ కోర్టుల్లోనూ తనకు అనుకూల తీర్పులు ఇప్పించుకుంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టబద్ధంగా ఎన్నికైన వ్యక్తులను తొలగించేందుకు ఇంకోదారి లేక బీజేపీ ఈ కుట్ర చేస్తోందన్నారు.
బీహార్‌లో 65 లక్షల ఓట్లను తీసేశారని, దీనిలో ముస్లిం, క్రిస్టియన్, ప్రతిపక్ష పార్టీల ఓట్లే ఉన్నాయని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 35వేల ఓట్లు తీసివేస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచేదెట్టా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీయాదవ్ ఓటే ఓటర్ లిస్టులో లేదన్నారు. ఎలక్షన్ కమిషన్ సైతం బీజేపీ ఏజెంట్‌లా మారిపోయి రాహుల్‌గాంధీని అఫిడవిట్ ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిమినల్ నేరాలను విచారించే సీబీఐ, ఆర్థిక నేరాలను విచారించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లను బీజేపీ చెప్పుచేతల్లో ఉంచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మురికున్న నేతలు బీజేపీలో చేరగానే నిర్మాతో శుద్ధి చేసినట్టుగా ఆ పార్టీ తీరు ఉందన్నారు. ఎన్ని చేసినా ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే ఈ 30 రోజుల కస్టడీ కేసు ఆధారంగా బొక్కలో వేసి అనర్హత వేటు వేస్తారన్నారు.
పెట్టుబడిదారి లక్షణాల్లో భాగమే ఈ కుట్రలు
ఈ బిల్లు మోడీ బుర్రలో పుట్టిన ఆలోచనో… అమిత్‌షా చేస్తున్న కుట్రో.. ఏ సుప్రీం కోర్టో చేస్తున్న గారడీ కాదని పెట్టుబడిదారుల సహజ లక్షణమే ఇదని తమ్మినేని అన్నారు. ఈ విషయాన్ని 160 సంవత్సరాల కిందటే మార్క్స్ చెప్పారని గుర్తు చేశారు. ‘పెట్టుబడిదారి సమాజం ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును, పార్లమెంట్‌ను, చట్టాన్ని, కోర్టును తన ప్రయోజనాలకు, కార్పొరేట్ శక్తుల లాభాలకు ఉపయోగపడేంత కాలం ఉపయోగించుకుంటుంది.. ఈ వ్యవస్థలేవీ ఉపయోగం పడవనుకున్నప్పుడు రద్దు చేసుకుంటూ పోతుంది..’ అన్నారు. ఈ ప్రజాస్వామ్య హననాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలా ఎండగట్టే దమ్ము, ధైర్యం ఉన్నవారే కమ్యూనిస్టులు అని చెప్పారు.
జాలీ దయ లేనివాడు కమ్యూనిస్టే కాదు..
కమ్యూనిస్టులను మించిన మానవతావాదులు ఎవరూ లేరని తమ్మినేని అన్నారు. కమ్యూనిస్టులపై బూర్జువా పార్టీలు జాలి, దయ లేని మనుషులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మనుషులం దర్నీ ప్రేమించే లక్షణం కమ్యూనిస్టులద న్నారు. కమ్యూనిస్టుల కోపం, ద్వేషం పెట్టుబడి దారి వ్యవస్థపైనే అని వివరించారు. సమానత్వా నికి ఆటంకం కల్పించే పెట్టుబడిదారీ సమాజాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అంతకుముందు కోటయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
కోటయ్య సంస్మరణ సభ సందర్భంగా ‘నవతెలంగాణ’ ప్రచురించిన ప్రత్యేక సంచికను తమ్మినేని తదితరులు ఆవిష్కరించారు. ఈ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రాజారావు, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, మాదినేని రమేష్, బంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, దొంగల కోటయ్య కుమారుడు- ఖానాపురం హవేలీ కార్యదర్శి తిరుపతిరావు, అల్లుడు డాక్టర్ అల్లాడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడినా ఆ కేసు పెట్టొచ్చు: బి.వెంకట్
ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులపైనా 30 రోజుల కస్టడీ కేసు నమోదు చేయొ చ్చని, తద్వారా వారు ప్రజాప్రతినిధిగా ఉంటే అనర్హత వేటు వేయొచ్చని వ్యవసాయ కార్మికసంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. పోడుభూముల పోరాటాలు చేసినా, ఇండ్ల స్థలాల కోసం ఉద్యమించినా, యూరియా కోసం రైతులు రోడ్డెక్కినా ఈ కస్టడీ కేసు నమోదు చేయొచ్చన్నారు. ప్రజా పోరాటాలను అణచడానికి మోడీ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందన్నారు. రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగే ఇటువంటి చట్టాలను బీజేపీ చేస్తోంద న్నారు. అమెరికా నిరుద్యోగాన్ని భారతదేశానికి ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.
30రోజుల కస్టడీ బిల్లు..ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES