ఈనెల 14తో ముగిసిన ఇంచార్జీల పాలన
మరో ఆరు నెలలు
పర్సన్ ఇన్‌చార్జి కమిటీలకే బాధ్యతలు
పాలకవర్గాల్లేక పర్యవేక్షణాలోపం
సొసైటీ తీర్మానాల్లేక అభివృద్ధి పనులు, కొత్త సొసైటీల ఏర్పాటుకు బ్రేక్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఎన్నికైన సొసైటీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో గత ఫిబ్రవరిలో పర్సన్ ఇన్‌చార్జి కమిటీలకు బాధ్యతలు కట్టబెట్టారు. దాన్ని రెండోసారి పొడిగించారు. రైతాంగానికి సంబంధించి పంటల సాగు, ఉత్పత్తుల విక్రయాలు, ఎరువులు, విత్తనాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, సభ్యుల నమోదు, కొత్త సొసైటీల ఏర్పాటు, మార్కెట్ భవనాల నిర్మాణం, పాత భవనాలకు మరమ్మతులు వంటి పనులన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరుగుతాయి. కీలకమైన సొసైటీలకు పాలక వర్గాల్లేకపోవడంతో పర్సన్ ఇన్‌చార్జీలు పట్టించుకోవడం లేదు. పైగా పాలక వర్గాల్లేనందున ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడానికి వీల్లేదు. సొసైటీ తీర్మానాలు చేయలేని పరిస్థితి వల్ల కీలకమైన పనులన్నీ ఆగిపోయాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన పీఏసీఎస్ సొసైటీలకు వెంటనే ఎన్నికలు జరపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
లక్షలాది మంది రైతులు సభ్యులుగా ఉన్న పీఏసీఎస్‌లకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడం వల్ల ఆర్థిక పరిపుష్టి లేక అనేక సొసైటీలు చతికిల పడ్డాయి. ఆశించిన మేరకు లావాదేవీలు నిర్వహించే సొసైటీల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. పాత జిల్లాల్లో హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లున్నాయి.
ఇన్‌చార్జీల పాలనలో గాడి తప్పిన సొసైటీలు
2020 ఫిబ్రవరిలో రాష్ట్రంలోని పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. 2025 ఫిబ్రవరి 14వ తేదీలో పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. వివిధ కారణాలతో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరగలేదు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన విధించినందున.. పీఏసీఎస్‌లకు మాత్రం పాత వాళ్లకే బాధ్యతలిస్తూ ఇన్‌చార్జి కమిటీ చైర్మెన్‌తోపాటు 12 మంది సభ్యులను కొనసాగించింది. పొడిగించిన సమయం కూడా ఈనెల 14తో ముగియడంతో మళ్లీ ఆరు నెలలపాటు పర్సన్ ఇన్‌చార్జీలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. రైతాంగానికి సంబంధించిన పీఏసీఎస్‌లకు పాలక వర్గాల్లేకపోవడం వల్ల పాలన పడకేసింది. రాష్ట్రంలో అనేకచోట్ల మార్కెట్లకు షెడ్లను నిర్మించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. రూ.2 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సొసైటీల్లోనూ మార్కెట్ షెడ్లు, భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం వంటి పనుల్లేవీ చేయలేకపోతున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు విషయంలోనూ పరిమితులకు లోబడే ఇవ్వాల్సి వస్తోంది. ట్రాక్టర్లు, గోల్డ్ రుణాలు, టర్మ్‌లోన్స్, కోళ్లఫారాలు, ఇతర పెద్ద షెడ్ల నిర్మాణం వంటివి మంజూరు కావట్లేదు. అదే విధంగా అవినీతి కూడా చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు సొసైటీల్లో అక్రమాలను గుర్తించారు. వానాకాలం సీజన్‌లో ఎరువుల సరఫరాలో తీవ్ర ఇబ్బందులొచ్చాయి. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి రైతులకు సబ్సిడీ యూరియా అందకుండా చేశారనే ఆరోపణలున్నాయి. పారిశ్రామికవాడల్లోని పలు కంపెనీల్లో యూరియా వాడుతున్నారు. అక్కడ కమర్షియల్ యూరియాకు బదులు రైతులకిచ్చే సబ్సిడీ యూరియాను దొడ్డిదారుల్లో వాడుతున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకూ చైర్మెన్, వైస్ చెర్మెన్‌తోపాటు డైరెక్టర్లు లేకపోవడం వల్ల కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
కొత్త సొసైటీల ఏర్పాటుకు బ్రేక్
రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా పీఎసీఎస్‌లు లేవు. గతంలోనే పీఎసీఎస్‌లను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న 906 సొసైటీలతోపాటు అదనంగా 434 సొసైటీలను కొత్తగా ఏర్పాటు చేయాలని భావించారు. రాష్ట్రంలో 272 మండలాల్లో ఒకే ఒక్క సొసైటీ ఉండగా.. 81 మండలాల్లో ఒక్క సొసైటీ కూడా లేదు. కొన్ని మండలాల్లోనే రెండు సొసైటీలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 పీఎసీఎస్‌లున్నాయి. మెదక్ జిల్లాలో 57 పీఎసీఎస్‌లుండగా వీటిల్లో 76765 మంది సభ్యులున్నారు. సంగారెడ్డి జిల్లాలో 53 పీఎసీఎస్‌లలో 71556 మంది, సిద్దిపేట జిల్లాలో 21 సొసైటీల్లో 67200 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా 30 కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రంలోని కొన్ని సొసైటీల్లో 500 మంది సభ్యులుండగా.. ఇంకొన్నింటిలో వేల సంఖ్యలో ఉన్నారు. గ్రామాలకు పది కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో సొసైటీలు ఉన్నాయి. మండలానికి కనీసం రెండు సొసైటీలైనా ఉండేలా కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు పాత వాటిని పునర్విభజన చేయాలని భావించారు. ఇటీవల అన్ని సొసైటీల్లోనూ కొత్త సభ్యుల నమోదు ప్రక్రియ కూడా చేపట్టారు. కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలంటే పాత సొసైటీలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటది. అందుకోసం సొసైటీ పాలనవర్గం తీర్మానం చేయాలి. ఇన్‌చార్జీల పాలనలో ఎలాంటి తీర్మానాలూ చేయడానికి అవకాశం లేనందున కొత్త సొసైటీల ఏర్పాటు ఆగిపోయింది.
పీఏసీఎస్‌లకు వెంటనే ఎన్నికలు జరపాలి
పీఏసీఎస్‌లకు వెంటనే ఎన్నికలు జరపాలి. రెండుసార్లు పర్సన్ ఇన్‌చార్జీలను పెట్టడం వల్ల ఉపయోగం లేదు. రైతుల సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయాలు చేసేందుకు పాలకవర్గాలుండాలి. ఎన్నికల్లేకపోవడం వల్ల డీసీసీబీ, డీసీఎంఎస్, పీఎసీఎస్‌లు నిర్వీర్యం అవుతున్నాయి.
– పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చెర్మెన్,ఉమ్మడి మెదక్ జిల్లా
పడకేసిన పీఏసీఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES