Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకాళేశ్వరం నివేదికపై చర్యలేంటి?

కాళేశ్వరం నివేదికపై చర్యలేంటి?

- Advertisement -

ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్లపై వాదనలు…విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ నివేదికపై చర్యలు ఎలా ఉంటాయో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చేశాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారా? లేదంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే చర్యలపై నిర్ణయం తీసుకుంటారా? అని ఆరా తీసింది. కీలకమైన ఈ అంశంపై శుక్రవారం జరిగే విచారణలో వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికిప్పుడే జవాబు చెప్పలేమని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి చెప్పడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ సారధ్యంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు జీవో 6ను, కమిషన్‌ గత నెల 31న సమర్పించిన నివేదికలను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌, ఇరిగేషన్‌ శాఖ మాజీ మంత్రి టి. హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఆర్యం సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదించారు. కమిషన్‌ నివేదిక ఏకపక్షంగా ఉంది. సాక్షిగా విచారణకు పిలిచి వివరాలు కోరితే పిటిషనర్లు కమిషన్‌కు చెప్పారు. ఇతర సాక్షులు అభియోగాలు చేసి ఉంటే ఎంక్వయిరీస్‌ ఆఫ్‌ కమిషన్‌ యాక్ట్‌-1952లోని సెక్షన్‌ 8-బి కింద పిటిషనర్లకు నోటీసు ఇవ్వలేదు. తమపై ఆరోపణలు చేసిన వాళ్లను క్రాస్‌ ఎగ్జామ్‌ చేసేందుకూ కమిషన్‌ నోటీసులు ఇవ్వలేదు. కమిషన్‌ విచారణకు ఆఖరి సాక్షి కేసీఆర్‌. అప్పటికే తమపై ఎవరైనా ఆరోపణలు చేసి ఉంటే ఆ విషయాలపై కమిషన్‌ కేసీఆర్‌ను ప్రశ్నించాలి. అలా చేయలేదు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ కాళేశ్వరంపై లేనిపోని విమర్శలు చేసింది. అధికారంలోకి రాగానే మేడిగడ్డ పిల్లర్‌ బీటలు వారడాన్ని అడ్డం పెట్టుకుని విచారణ కమిషన్‌ను నియమించింది.

కుట్రతో 2024 మార్చి 14న జీవో 6 ద్వారా కమిషన్‌ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్‌, నిర్మాణంపై కమిషన్‌ విచారణ చట్ట వ్యతిరేకంగా సాగింది. 2007లో ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో ముందుకు సాగలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థతో సర్వే జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణాలతో కాళేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు పిటిషనర్‌ కేసీఆర్‌ సీఎంగా ఉండగా క్యాబినెట్‌ ఆమోదం చెప్పింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా ఇచ్చాయి. అయితే, కేసీఆరే స్వయంగా ప్రాజెక్ట్‌ ప్రదేశాలను ఎంపిక చేశారని తప్పుగా కమిషన్‌ తేల్చింది. కేబినెట్‌ ఆమోదం లేదని కూడా చెప్పడం సరికాదు. పరిపాలనా అనుమతులు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు అనుకూలంగా, అదనపు పనులకు ఆదేశాలిచ్చామని కమిషన్‌ చెప్పడం వాస్తవం కాదు.

బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడంతో మేడిగడ్డ పిల్లర్‌ బీటలు వారిందని చెప్పడం కూడా నిజం కాదు. భారీ వర్షాల వల్ల బీటలు వారాయి. నిర్వహణ వ్యవహారాల బాధ్యత పూర్తిగా అధికారులది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నామని కమిషన్‌ తప్పుపట్టటం వాస్తవం కాదు. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ దేశంలో రైస్‌ బౌల్‌గా మారింది. పలు పట్టణాలకు తాగు నీరు అందించింది. పరిశ్రమలకు కూడా నీరు అందింది. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 38 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తిపోతల వ్యవస్థతో 240 టీఎంసీల నీటి వినియోగం కోసం కాళేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీనికి ముందు వలసలు, ఫ్లోరైడ్‌ సమస్యలు, విద్యుత్‌ కోతలు, సాగుకు నీరు లేని పరిస్థితులు ఉండేవి. కమిషన్‌ నిజనిర్ధారణ మాత్రమే చేయాలి. వ్యక్తులపై ఆరోపణలు చేయడానికి వీల్లేదు. సాక్షుల నుంచి సమాచారం ద్వారా అలాంటి పరిస్థితులు ఉంటే విచారణ కమిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 8-బి- 8-సి మేరకు ఆరోపణలు చేసిన వాళ్లను క్రాస్‌ ఎగ్జామ్‌ చేసేందుకు పిటిషనర్లకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం కమిషన్‌ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలన్న చట్ట నిబంధనలను తుంగలో తొక్కింది. కమిషన్‌ సహజ న్యాయ సూత్రాలు, ప్రాథమిక న్యాయ సూత్రాలను గాలికి వదిలేసింది. కమిషన్‌ ప్రభుత్వానికి 650 పేజీల నివేదికను ఇచ్చింది. దాని ప్రతి ఇవ్వాలని కోరితే పిటిషనర్లకు ఇవ్వలేదు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ వేసి 60 పేజీల బ్రీఫ్‌ రిపోర్టు తెప్పించుకుంది. దీనితో సీఎం, మంత్రి, ఇతరులు కలిపి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ప్రదర్శించి పిటిషనర్లపై దుమ్మెత్తిపోశారు.

ఇదంతా ఒక పథకం ప్రకారం రాజకీయంగా పిటిషనర్లను దెబ్బతీయాలనే కుట్రతో జరుగుతోంది. చట్ట వ్యతిరేకమైన విధానాలను పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని జీవో 6తోపాటు కమిషన్‌ రిపోర్టును రద్దు చేయాలి.. అని వాదించారు.
రాష్ట్రం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ కమిషన్‌ ముందున్న సమాచారం మేరకు విచారణ ఉంటుందనీ, సెక్షన్‌ 8-బి, 8-సి సెక్షన్ల కింద నోటీసు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా వెచ్చించిన తర్వాత కూడా నీళ్లను లిఫ్ట్‌ చేయలేని దుస్థితి ఉందన్నారు.
కమిషన్‌ నివేదికపై ప్రభుత్వం అసెంబ్లీలో లోతుగా చర్చించాల్సి వుందని, పిటిషనర్లు ఇద్దరూ ఎమ్మెల్యేలని, అసెంబ్లీలో జరిగే చర్చలో అన్ని విషయాలు వాళ్లు చెప్పుకునే ఆస్కారం ఉందని అన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని, పిటిషన్లను కొట్టివేయాలన్నారు. లేదంటే కౌంటర్‌ వేస్తామని, గడువు కావాలని కోరారు. కమిషన్‌ రిపోర్టును ప్రభుత్వ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్‌ చేయొద్దన్నారు. కమిషన్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, కమిషన్‌ సమగ్రంగా విచారణ జరిపిందన్నారు. పిటిషనర్లు చెబుతున్న సుప్రీంకోర్టు తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. కమిషన్‌ రిపోర్టుపై జోక్యం అవసరం లేదన్నారు. వాదనలపై హైకోర్టు, కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉంటాయో, లేక చర్యలు తీసుకున్నా అసెంబ్లీలో రిపోర్టు పెడతారో శుక్రవారం జరిగే విచారణ సమయంలో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad