రిటర్నింగ్ అధికారికి నాలుగు సెట్ల పత్రాలు సమర్పించిన బి.సుదర్శన్ రెడ్డి
పాల్గొన్న ఖర్గే, సోనియా, రాహుల్ పలువురు నేతలు
హాజరైన సీపీఐ(ఎం) ఎంపీలు కె.రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్
మద్దతు తెలిపిన ఆప్…సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పార్లమెంట్‌లో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రెటరీ జనరల్ సిపి మోడీకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ఎంపీలు కె.రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, ఎస్‌పీ అధినేత శరద్ పవర్, ఎస్‌పీ కీలకనేత రాంగోపాల్ యాదవ్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ ఎంపీ శతాబ్ధిరారు, శివసేన ఎంపీలు సంజరు రౌత్, గణపతి సావంత్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తదితరుల సమక్షంలో బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 160మంది ఎంపీలు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేశారు. రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను పరిశీలించి, రసీదు స్లిప్‌ను అందజేశారు. ఉప రాష్ఱ్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న జరుగనున్న విషయం విదితమే. ఈ ఎన్నికల్లో ఆయన అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సి.పి రాధాకృష్ణన్‌తో పోటీ పడుతున్నారు. రాధాకృష్ణన్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
ఉపరాష్ట్రపతి ఎన్నిక..భారతదేశం ఆలోచన కోసం : బి.సుదర్శన్ రెడ్డి
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి గురించి మాత్రమే కాదనీ, భారతదేశం ఆలోచన గురించి అని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసే గౌరవం తనకు లభించిందని అన్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన విలువల పట్ల లోతైన అవగాహన, బాధ్యత, అచంచలమైన నిబద్ధతతో తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. పార్లమెంట్ సమగ్రతతో పని చేసే, అసమ్మతిని గౌరవించే, సంస్థల స్వతంత్రత, న్యాయంగా ప్రజలకు సేవ చేసే భారతదేశం ఆలోచనను పునరుద్ఘాటించేందుకు పోటీలో ఉన్నా నని ఆయన నొక్కి చెప్పారు.
తాను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే తన పాత్రను నిష్పాక్షికంగా, గౌరవంగా నిబద్ధతతో నిర్వర్తిస్తానని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ గణతంత్ర ప్రజాస్వామ్య సం ప్రదాయాల్లో పాతుకు పోయిన పౌరుడిగా నా ప్రజా సేవ, దేశంలోని నిజమైన బలం ప్రతివ్యక్తి గౌరవం, రాజ్యాంగ నైతికత రక్షణ, మన వైవిధ్యంలో ఏకత్వం లో ఉందని తనకు నేర్పిందని చెప్పారు. రాజ్యసభ చైర్మెన్‌గా ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యున్నత సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యతను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
సుదర్శన్‌రెడ్డికి ఆప్ మద్దతు
ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి ఆప్ మద్దతు తెలిపింది. గురువారంనాడిక్కడ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సుదర్శన్‌రెడ్డి కలిశారు.
ఆయన అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన నిష్పాక్షిక రికార్డు ఆయనను ఉన్నత రాజ్యాంగ పదవికి అర్హుడిగా చేసిందని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి గెలుపు కోసం తామందరమూ ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
రైతు కుటుంబం నుంచి సుప్రీంకోర్టు జడ్జీ వరకు..
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో 1946 జులై 8న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1971లో న్యాయవిద్య పూర్తి చేశారు. అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. 1988-90 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో కేంద్రం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్‌గా, ఉస్మానియా యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, న్యాయసలహాదారుగా పనిచేశారు. 1995 మే2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12 నుంచి 2011 జులై 7వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా ఆయన నియమితులయ్యారు. అదే ఏడాది అక్టోబర్‌లో ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా, బీసీ కులగణన అధ్యయన కమిటీ చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. న్యాయ మూర్తిగా పనిచేసిన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన లక్ష్యంగా సల్వాజుడుంపై నిషేధం విధిస్తూ తీర్పునిచ్చారు. అసైన్డ్ భూ సేకరణకు పరిహారం చెల్లింపుపై కీలక తీర్పు వెలువరించారు.
ఎన్డీఏ-‘ఇండియా’ బలాబలాలు
ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభలు లోక్‌సభ, రాజ్యసభలలో ఖాళీలతో కలిపి 786మంది సభ్యులున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు 394మంది సభ్యుల మెజార్టీ అవసరం. ఎన్డీఏకు లోక్ సభలో 293మంది, రాజ్యసభలో 129మందితో కలిపి మొత్తం 422మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు లోక్‌సభలో 234, రాజ్యసభలో 79మంది కలిపి మొత్తం 313మంది సభ్యుల బలం ఉంది. సంఖ్యాబలం మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సి.పి రాధాకృష్ణన్ విజయం సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రజా,కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కారుకు సొంత మెజారిటీతో అధికారంలో లేదని విపక్ష నేతలు చెప్తున్నారు. మిత్రపక్షాల బలం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో క్రాస్ ఓటింగ్‌పై నమ్మకంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించింది. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -