Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవైద్యారోగ్యశాఖలో 1,623 పోస్టుల భర్తీ

వైద్యారోగ్యశాఖలో 1,623 పోస్టుల భర్తీ

- Advertisement -

– త్వరలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల నోటిఫికేషన్‌
మరో 7 వేల పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైద్యారోగ్యశాఖలో మరోసారి భారీ నోటిఫికేషన్‌ వెలువడనున్నది. 1,623 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యసేవల నియామక మండలి (మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు)ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బోర్డు ఒకట్రెండు రోజుల్లో ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ పోస్టులు భర్తీ అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల సంఖ్య పెరగనున్నది. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వీరి రాకతో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. గ్రామాలకు స్పెషాలిటీ వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
మెరుగైన ఆరోగ్యసేవలందించేందుకు ఇప్పటికే 8వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 7 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. 2,322 నర్సింగ్‌ ఆఫీసర్లు, 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 732, ఫార్మసిస్ట్‌, 1,931 ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ (ఏఎన్‌ఎం) పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌, నర్సింగ్‌ ఆఫీసర్లకు ఫలితాలకు సంబంధించి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌లను బోర్డు విడుదల చేసింది. ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ (ఏఎన్‌ఎం) పోస్టుల్లో ప్రభుత్వ వైద్యసంస్థల్లో పని చేసిన కాంట్రాక్ట్‌ సిబ్బందికి వెయిటేజీ ఉండటంతో వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. అదే విధంగా ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2 కు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తైంది. మొత్తం 6,269 పోస్టుల ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నది. ఈ పోస్టుల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,17,658 మంది ఎదురు చూస్తున్నారు. ల్యాబ్‌ టెక్నిషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల కోసం 24,045 మంది, నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టుల కోసం 42,244 మంది, ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ పోస్టుల కోసం 24,268 మంది, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల కోసం 27,101 మంది దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్యసేవలందించే వైద్యులు, పారామెడికల్‌, నర్సింగ్‌ సిబ్బంది భర్తీతో పాటు వైద్యవిద్య బలోపేతానికి పోస్టుల భర్తీని వేగంగా చేపట్టాలని నిర్ణయించారు. 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 4 స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరోవైపు రాష్ట్రాన్ని నకిలీ మందులరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు, ఆహార కల్తీని పూర్తిగా నిరోధించేందుకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad