న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో మనదేశ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష కేంద్ర అనుభవం వెలకట్టలేనిదని, అక్కడ ఎంతో నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తుందన్నారు. 1984లో ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ చెప్పినట్లు సారే జహాసే అచ్చా అన్న రీతిలోనే ఇండియా ఇప్పటికీ ఉన్నట్లు శుక్లా తెలిపారు. ప్రస్తుతం శుభాంశు శుక్లా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన ఆయన.. ఢిల్లీలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. శిక్షణ పొందిన దాని కన్నా ఎక్కువగా మానవ అంతరిక్ష మిషన్‌ను హ్యాండిల్ చేయాల్సి వస్తుందన్నారు. ఆ మిషన్‌లో భాగం కావడం వల్ల వచ్చే జ్ఞానం వెలకట్టలేనిదన్నారు. గత కొంత కాలంగా సేకరిస్తున్న సమాచారం.. మన దేశం చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు ఉపయుక్తంగా ఉంటుందని శుక్లా పేర్కొన్నారు. గగన్‌యాన్‌తో పాటు భారతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో తన అనుభవం కీలకం కానున్నట్లు చెప్పారు. తొందరలోనే మన క్యాప్సూల్ నుంచి మన రాకెట్ ద్వారా మన దేశ వ్యోమగామి అంతరిక్షం వెళ్తారన్నారు.