– ప్రజలు కష్టాల్లో ఉన్నంతకాలం
– ప్రజా కళాకారులు ఉంటారు
– ఈ సమాజానికి కమ్యూనిస్టు పార్టీ అవసరం: ప్రజానాట్యమండలి సభలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ-రామన్నపేట
”అంతులేని ఖనిజ సంపద, విశాలమైన భూములు ఉండి అన్నింటా అన్నీ ఉన్నా.. ఈ దేశంలో అప్పులు ఎందుకు ఉన్నాయి? కొలువులు రాని కోట్లాది నిరుద్యోగులు, చదువులు కొనలేని, గూడు లేని పేదలు ఎట్టా ఉన్నారు?..” అని అడిగేది ఎర్రజెండా మాత్రమే అని ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ప్రజానాట్యమండలి యాదాద్రిభువనగిరి జిల్లా మహాసభ సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో గురువారం రెండోరోజు వీధి నాటకోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ.. భూ ప్రపంచం ఉన్నంతకాలం ఎర్రజెండా, దానితోపాటు పోరాటం ఉంటాయని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నంతకాలం ప్రజా కళాకారులు ఉంటారన్నారు. దేశంలో 70 శాతం మంది ప్రజలు అప్పులు, కష్టాల్లో ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే అంతులేని సంపదతో తులతూగుతున్నారని వివరించారు. ప్రజానాట్యమండలి చేస్తున్న పని చాలా గొప్పదని, పేదల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఆయుధమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు, కళాకారులు మతానికి, కులానికి వ్యతిరేకం కాదన్నారు. అందరూ స్వేచ్ఛగా తమ తమ విశ్వాసాలను పాటిస్తూ కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించాలన్నదే కమ్యూనిస్టుల లక్ష్యమని చెప్పారు. ఒక ఊరిలో కమ్యూనిస్టులు ఉంటే ఆ ఊరికి అండగా ఉంటుందన్నారు. అందుకే సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.
తేనెతో నిండిన తియ్యటి పండ్లలాంటి వారు ప్రజానాట్యమండలి కళాకారులని, నిస్వార్ధంగా ప్రజాకళను బతికిస్తున్నారని తెలిపారు. తరాలు మారినా ప్రజాకళాకారుల స్వరాలు మారవన్నారు. సప్ధర్ హష్మీ ఆశయాల సాధన కోసం మనమందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాటతో నైజాం నవాబు గుండెల్లో తూటాలు పేల్చిన.. సుద్దాల హనుమంతు నడయాడిన రామన్నపేట నేల నేడు ప్రజా కళారూపాలతో పునీతమైందన్నారు. తాను ప్రజాప్రతినిధిగా ఎన్నడూ ఫీల్ కాలేదని, ప్రజాకళలే తనను ప్రజాప్రతినిధిగా చేశాయన్నారు. ఈ పదవి ప్రజా కళాకారులకే అంకితం అని, ప్రతి కళాకారుడి గొంతుక వినిపించడం కోసమే శాసనమండలిలో అడుగుపెట్టానని తెలిపారు. పేదల బతుకుల పాటలను గోరెటి వెంకన్న ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన వీధి నాటకాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేముల ఆనంద్, కట్టా నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అవారి గోవర్ధన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలు ఎట్లున్నారని అడిగేదే ఎర్రజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES