మేం ప్రజాసేవలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు
రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘సమ్మక్క, సారక్క మాదిరిగా నేనూ, సీతక్క కలిసున్నాం. సీతక్క నాకు సోదరితో సమానం. ఆమెతో నాది ఉద్యమాల పేగు బంధం. అటువంటి మాపై కొంతమంది మీడియా సోదరులు సంఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలని వార్తలు రాస్తున్నవారినీ, రాయించుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్న వారిని గమనిస్తున్నా. ఈ రోజు జరిగిన పరిణామాలు నిశితంగా పరిశీలించిన తర్వాత చాలా బాధేసింది. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలేనప్పుడు అతి కొంతమంది మీడియా సోదరులకి ఎందుకు అంత ఉత్సాహమో నాకు అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కారు పార్టీ నేతలకు, కల్వకుంట్ల గడీలకు ఊడిగం చేసే అతి కొంతమందికి కలలో కూడా కలవరం తీసుకువచ్చేంతటి జ్ఞాపకాలుగా తానూ, సీతక్క మారామని తెలిపారు. సీతక్క చెప్పినట్టు రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని కోరారు. ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేని కొన్ని శక్తులు పితృస్వామిక వ్యవస్థ పుత్రులు, మిత్రులు అని విమర్శించారు. సొంత ఇంట్లోని ఆడబిడ్డలను ఏకాకి చేస్తూ దృష్ట రాజకీయం చేస్తున్నారని తెలిపారు. గత సమ్మక్క, సారక్క జాతరకు డెంగ్యూ జ్వరంతో రాలేకపోయాననీ, దాన్ని చూపెట్టి సీతక్క, తన మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు గానీ, వ్యక్తిగత విభేదాలుగానీ లేవని స్పష్టం చేశారు. ఒక మహిళ రాష్ట్ర రాజకీయాల స్థాయికి ఎదగడమంటే సామాన్యమైన విషయం కాదని మీడియా సోదరులు గుర్తించాలని సూచించారు. లేనిపోని, అపోహలు సృష్టించే వార్తలు రాయొద్దని హితవు పలికారు.
నేనూ, సీతక్క సమ్మక్క సారక్కలా కలిసున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES