– హ్యామ్ పద్ధతిలో త్వరలో నాణ్యమైన, మెరుగైన రోడ్లు
– కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై దృష్టి సారించండి : ఆర్‌అండ్‌బీ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లపై పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీ జయ భారతి, సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్‌ఈ ధర్మారెడ్డి, పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు. సుమారు రూ.1000 కోట్ల వరకు ఆర్ అండ్ బి శాఖ రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర రహదారులు, కల్వర్టులు, మైనర్ బ్రిడ్జీల స్థితిగతులు, వాటి లైఫ్ టైమ్ నమోదు చేయాలని ఆదేశించారు. పూర్తి శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రపోజల్స్ తయారు చేయాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలోనే హ్యామ్ విధానం ద్వారా మెరుగైన, నాణ్యమైన రోడ్లు వేసుకోబోతున్నామని చెప్పారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ సీజన్ వర్షాలు తగ్గుముఖంపట్టగానే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆరా తీసిన మంత్రి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తాను ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర పరిధిలోని ప్రాజెక్టులపై మాట్లాడాననీ, రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజ్ఞప్తులు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తు చేశారు. ఖానాపూర్ నుంచి బెల్లాం, ఉట్నూర్ నుండి గుడి హత్నూర్ రోడ్ మార్గంపై మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.
రోడ్ల డ్యామేజీపై నివేదిక సిద్ధం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES