అత్యధిక నిధులు కేటాయింపు
– ‘పనుల జాతర 2025 పోస్టర్’ విడుదల
– కేటీఆర్‌ది డర్టీ మైండ్ : మంత్రి సీతక్క
– ఆదివాసీ గిరిజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించింది : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ, సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరం కోసం ఎన్నడూ లేని విధంగా ఈ దఫా రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్ట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని తెలిపారు.
జాతర కోసం శాశ్వత పనులు చేపడుతున్నామనీ, జంపన్న వాగు నుంచి మేడారం ప్రాంగణం వరకు డబుల్ రోడ్లు, డివైడర్లు, 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతివనం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామనీ, భద్రత కోసం 12 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ”13వ శతాబ్దపు ఈ చారిత్రక జాతరను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం” అని మంత్రి చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సమ్మక్క – సారలమ్మ గత జాతరకు రూ. 105 కోట్లు కేటాయిస్తే… ఈసారి రూ.150 కోట్లు కేటాయించినట్టు గుర్తు చేశారు. ఆదివాసీ పూజారులు కోరిన విధంగా జాతర పనులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను పట్టించుకోలేదనీ.. అయితే ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
పనుల జాతర 2025 పోస్టర్ విడుదల
పంచాయతీరాజ్ శాఖ తరపున ‘పనుల జాతర 2025 పోస్టర్’ ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ”శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15 వేల పనులు రూ.2,198 కోట్ల వ్యయంతో ప్రారంభం కానున్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు, మేకల, గొర్రెల షెడ్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఉన్నాయి. ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాల రూపురేఖలు మార్చడంలో ఈ పనుల జాతర కీలక పాత్ర పోషిస్తుంది” అని చెప్పారు. పనుల జాతరలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని తాను వ్యక్తిగతంగా లేఖలు పంపినట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజలతో కలిసి పనిచేయాలని కోరారు. మంత్రి కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవనీ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ”సమ్మక్క-సారలమ్మ వలె అక్కాచెల్లెళ్లలా మేము కలిసే ఉన్నామన్నారు. రాజకీయాల్లో మహిళలు ఎదగడానికి సమాజం సహకరించాలి. ఆడబిడ్డలు ఇంట్లో, సమాజంలో సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” అని తెలిపారు.
కేటీఆర్‌ది డర్టీ మైండ్..
కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ ప్రభుత్వం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండి పడ్డారు.”థర్డ్ క్లాస్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ అహంకారంతో, మాట్లాడుతున్నారనీ, ఆయనది డర్టీ మైండ్ అని విమర్శించారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించడం కేటీఆర్ డర్టీ మైండ్ కు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కేసులు, వ్యక్తిగత సమస్యలతో విసిగిపోయి కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారని ఎద్దేవా చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇచ్చిన వారికి మద్దతు ఇస్తానని కేటీఆర్ చెబుతున్నారంటే.. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని ఆయనకు తెలియదా? బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయి రాష్ట్రంలో యూరియా కొరతను సష్టించాయని ఆరోపించారు. యూరియా కోసం పార్లమెంటు వేదికగా ప్రియాంక గాంధీ సైతం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. మూడో ఫ్రంట్ అంటూ నాడు కేసీఆర్ దేశమంతా తిరిగిన సంగతి అందరికీ తెలిసిందేననీ, ఆ థర్డ్ ఫ్రంట్ పార్టీలన్నీ కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని గుర్తు చేశారు. నిజానికి బీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందనే విషయాన్ని దాచలేకపోతున్నారన్నారు. డొంక తిరుగుడు మాటలాపాలని హితవు పలికారు.