తగ్గుతున్న ఆడపిల్లల నిష్పత్తి..
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా మార్పులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఆడజన్మకు ఎన్ని శోకాలో…. అనేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లింగ నిష్పత్తి పరంగా ఆందోళన కనిపిస్తోంది. ఆదిలోనే ఇక్కట్లనేలా బాలబాలికల నిష్పత్తిలో తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తుంది .ఓవైపు శిశుమరణాలు తీరు దిగాలును పెంచుతుంటే మరోవైపు జన్మిస్తున్న వారిలో బాలురే అధికంగా ఉండటం భవిష్యత్తు దిశగా బెంగను ఇంతకింతకు పెంచుతుంది. 2024 జనన మరణాల లెక్కల ప్రకారం నాలుగు జిల్లాల పరిధిలో భిన్నమైన గణాంకాలు రాబోవు రోజులకు సవాలును విసురుతున్నాయి. తీరు మార్చుకోకుంటే తిప్పలు తప్పవనేలా హెచ్చరికల్ని అందిస్తున్నాయి.
లింగ నిష్పత్తి ఊహకందని విధంగా తగ్గుముఖం..
2011 జనాభా లెక్కలు తీరుతో పోలిస్తే 0- ఆరేళ్ల చిన్నారుల లింగ నిష్పత్తి ఊహకందని విధంగానే తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలోనీ ప్రతి 1,000 మంది బాలురకు గాను కేవలం 831 మంది మాత్రమే బాలికలు పుట్టారు. 12 ఏళ్లలో ఈ తీరులో భారీ తేడా కనిపించింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా కొద్ది మేర వ్యత్యాసం ఉన్న కరీంనగర్ స్థాయిలో మాత్రం ఆందోళన లేదు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి బాలికల పుట్టుక విషయంలో దరిచేరుతోంది .ఇక్కడ గతంతో పోలిస్తే ఏటికాయేడు ఆడపిల్లల జననాలు పెరుగుతున్నాయి. దీంతో లింగ నిష్పత్తి తీరులో కూడా క్రమమైన వృద్ధి ఈ జిల్లా సొంతమవుతుంది. 2011తో పోలిస్తే మెరుగైన పురోగతి ఇక్కడుంది.
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మరణాలు…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. అన్ని వయస్సులవారు పల్లెల్లో 12126 మంది అనగా 67.70 శాతం మంది చనిపోగా పట్టణ ప్రాంతాల్లో 5783 మంది అనగా 32.29 శాతం మంది తనువు చాలించారు. జగిత్యాల జిల్లాలో పల్లెల్లో 3,294 మంది పట్టణాల్లో 1285 మంది కరీంనగర్ జిల్లాల్లో గ్రామాల్లో 3194 మంది పట్టణ ప్రాంతాల్లో 2101 మంది పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3298 మంది పట్టణాల్లో 1652 మంది సిరిసిల్ల జిల్లాలోని ఊళ్ళలో 2340 మంది జన్మించగా పురపాలికల్లో 745 మంది వివిధ కారణాలతో మృత్యు ఒడిని చేరారు.
పట్టణాల్లో పుట్టుకల జోరు..
నాలుగు జిల్లాల పరిధిలో పుట్టుక విషయంలో పట్టణాలు జోరుని చూపించాయి. పల్లెల్లోనూ పరవాలేదనే తీరు కనిపిస్తుంది. ఏడాదిగా జన్మించిన 43,794 మందిలో మున్సిపల్ పరిధిలో 38,496 మంది అనగా87.90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 5298 అనగా12.09 శాతం మంది జన్మించారు. కరీంనగర్ జిల్లాలో పురనగర పాలికల్లో10818 పల్లెల్లో 1307 మంది పుట్టారు అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో13626 గ్రామీణ ప్రాంతాల్లో 1917 మంది జన్మించారు పెద్దపెల్లి జిల్లాలోని పురపాలికల్లో 8189 మంది గ్రామాల్లో 933 మంది ఈ లోకంలోకి అడుగుపెట్టారు. సిరిసిల్ల జిల్లాలో పురపాలికల్లో 5865 గ్రామాల్లో 1139 మంది పుట్టారు.
చైతన్యం వస్తేనే…
బాల బాలికల కోసం అమలవుతున్న పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో లింగ నిష్పత్తి వ్యత్యాసాన్ని అధిగమించేలా చైతన్యం తేవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. కనిపిస్తున్న వివక్ష తొలిగేలా ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యత మరింతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ మంచి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తే సత్ఫలితాలు సమీప భవిష్యత్తులో కనిపించే వీలుంటుంది. ఇక శిశు మరణాలను తగ్గించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ ఐసీడీఎస్ విభాగాలు మరింత సమర్థవంతంగా పరిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యత్యాసానికి కోసం గల కారణాలని అన్వేషించడంతోపాటు ఆయా ప్రాంతాలను గుర్తించి అవసరమైన మార్పును చూపిస్తేనే మంచి పరిణామాలు మున్ముందు కనిపించే వీలుంది. ఈ దిశగా అసలైన వికాసం వెళ్లివిరిస్తేనే ఆడపిల్లతో పాటు అమ్మకు తగిన ఆదరణ లభిస్తుంది.