– నేటి నుంచి 28 మండలాల్లో రెండో విడత : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం- 2025 రైతులకు రక్షణ కవచమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడుతలో నేటి నుంచి రాష్ట్రంలోని 28 మండలాల్లో భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెల 17నుంచి 30వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో మొదటి విడత నిర్వహించిన మాదిరిగానే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలకబోతోందని అన్నారు. భూ భారతి చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. ఇక నుంచి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజల్లో విస్తృత స్ధాయిలో అవగాహన కల్పించడంతోపాటు ఆయా మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రతి కలెక్టర్ రెవెన్యూ సదస్సులకు హాజరై రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలను వారికి అర్ధమయ్యే భాషలో వివరించి పరిష్కారం చూపుతారని పేర్కొన్నారు. భూ భారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
రెండో విడతలో ……
ఆదిలాబాద్ జిల్లా భరోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, హన్మకొండ జిల్లా నడికుడ, జగిత్యాల జిల్లా బుగ్గారం, జనగాం జిల్లా ఘన్‌పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల్, కరీంనగర్ జిల్లా సైదాపూర్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్, మంచిర్యాల జిల్లా భీమారం, మెదక్ జిల్లా చిల్పిచిడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర, నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవల్లి, నల్గొండ జిల్లా నకిరేకల్, నిర్మల్ జిల్లా కుంతాల, నిజామాబాద్ జిల్లా మెండోరా, పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, రంగారెడ్డి జిల్లా కుందుర్గ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, సూర్యాపేట జిల్లా గరిడేపల్లె, వికారాబాద్ జిల్లా ధరూర్, వనపర్తి జిల్లా గోపాలపేట, వరంగల్ జిల్లా వర్దన్నపేట్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలాల్లో నేటి నుంచి భూ భారతి అమలు కానుంది.
భూభారతి రైతులకు రక్షణ కవచం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES