కోడలంటే ఇలానే ఉండాలి, ఇంట్లో పని మొత్తం చేయాలి అనుకుంటారు అందరు. అయితే ఇది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు. వారు పెరిగిన విధానం, వారి ఆలోచనా ధోరణిని బట్టి మనుషులు ఉంటారు. అలాగే కోడలికి కూడా ఆమె పుట్టి, పెరిగి వచ్చిన చోటు ఒక విధంగా ఉంటుంది. పెండ్లి చేసుకొని అడుగుపెట్టిన చోటు మరో విధంగా ఉంటుంది. వచ్చీరాగానే అన్నీ పనులు ఆమే బాధ్యతగా చేసేయాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు. దీని వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అత్తమామలు ఇందులో అతిగా జోక్యం చేసుకుంటే ఆ సమస్యలు మరింత పెరుగుతాయి. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
రజినికి సుమారు 25 ఏండ్లు ఉంటాయి. పెండ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. భర్త శ్రీధర్. ఇంట్లో వీరిద్దరితో పాటు అత్తమామలు ఉంటారు. ఆడపడుచుకు పెండ్లి అయి అత్తగారింట్లో ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. తండ్రి ఏం చెప్పినా శ్రీధర్ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడడు. శ్రీధర్ బిజినెస్ చేస్తాడు. రజిని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు మూడు షిప్టులు ఉంటాయి. దాంతో ఇల్లు, ఉద్యోగం సమన్వయం చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. జనరల్ షిప్ట్ అయితే ఎలాగో చేసుకుంటుంది. అదే నైట్ షిప్ట్ అయితే చాలా కష్టంగా ఉండేది. అయితే ఆమె ఏం వంట చేసినా అత్త పెద్దగా పట్టించుకోదు. ఎలా ఉన్నా సర్దుకుపోతుంది. కానీ మామ మాత్రం ప్రతి దానికి వంకలు పెడుతుంటాడు. ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేస్తుంటాడు. చేసిన పనినే పది సార్లు చేయిస్తుంటాడు. ఇదంతా రజినీ చాలా ఇబ్బందిగా ఉండేది.
పని చేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకుందామంటే పది రోజులకు ఒక అమ్మాయిని మార్చుతుంటాడు. వాళ్ల పనికి కూడా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు. దాంతో ఆ ఇంట్లో పని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. అతని భార్య చేసినా ఇలాగే నసుగుతుంటాడు. పోనీ రజినీ ఉద్యోగం మానేస్తానంటే దానికీ ఒప్పుకోడు. పైగా ఆమె జీతం మొత్తం తెచ్చి అతని చేతికి ఇవ్వాలి. ఆమెకు అవసరం అయినప్పుడు అతని దగ్గర అడిగి తీసుకోవాలి. చివరకు ఆరోగ్యం బాగోకపోయినా అతన్నే అడగాలి. దాంతో తండ్రికి తెలియకుండా శ్రీధర్ ఆమె జీతం నుండి నేరుగా కట్ అయ్యేలా బీమా, హెల్త్ పాలసీలు తీసుకున్నాడు.
తర్వాత నెలలో జీతం తక్కువ వచ్చేసరికి మామ, రజినీని నిలదీశాడు. శ్రీధర్ అసలు విషయం చెప్పేసరికి రజినీ వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి పంచాయితీ పెట్టాడు. ఎవరు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దాంతో రజిని, శ్రీధర్ తమ పాలసీలను రద్దు చేసుకున్నారు. కానీ ఇదంతా రజినీ భరించలేకపోయింది. చివరకు ఏవైనా ఫంక్షన్లు ఉంటే ఆమె ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా అతనే నిర్ణయిస్తాడు. ఇలా ఇంట్లో ఏదైనా సరే మామ చెప్పినట్టే జరగాలి. రజినీ ఈ విషయం గురించి శ్రీధర్‌కు ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దాంతో విసిగిపోయిన రజిని పుట్టింటికి వచ్చేసింది. ఆమె వెళ్లిన తర్వాత రోజే వాళ్ల నానమ్మ చనిపోయింది. దాంతో చావు అయిపోయిన తర్వాత ఆమెను కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి వద్దువు అని చెప్పి మామయ్య వచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. పదో రోజు దినం అయితే ఆ రోజు ఆమెను వెళ్లనివ్వ లేదు. అతను మాత్రం వెళ్లాడు.
శ్రీధర్‌కు చెప్పి అతన్ని తీసుకొని వెళ్లింది. దాంతో మామకు బాగా కోపం వచ్చింది. ‘నేను వద్దని చెప్పినా ఇక్కడకు ఎందుకు వచ్చావు’ అని రజినీని తిట్టాడు. ‘నువ్వు మాకు ఇక అవసరం లేదు, ఇక ఇక్కడే ఉండు’ అని కొడుకుని తీసుకొని వెళ్లిపోయాడు. కోపంలో ఉన్నారు రెండు రోజుల తర్వాత కోపం తగ్గిపోతుందిలే అనుకున్నారు అందరూ. కానీ ఎన్ని రోజులు గడిచినా ఆమెను ఇంటికి రానివ్వడం లేదు. దాంతో ఆమె ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము శ్రీధర్ వాళ్ల కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడితే ‘రజిని మా ఇంటికి వచ్చిన తర్వాత మా పద్దతులు ఫాలో కావాలి. మేము చెప్పినట్టు వినాలి. అలా కాకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు, నచ్చినట్టు ఉంటానంటే ఎలా? ఆమె చేసిన తప్పుకు అందరి ముందు మాకు క్షమాపణ చెప్పి, ఇంకోసారి ఇలా ప్రవర్తించను అంటే అప్పుడు మాతో పాటు తీసుకెళతాం, లేకపోతే లేదు’ అన్నాడు. తండ్రి మాట్లాడుతుంటే శ్రీధర్ అస్సలు నోరు విప్పలేదు. పైగా ‘మా నాన్న ఏది చెబితే అదే చేయాలి. నేనుగానీ మా అక్కగానీ అమ్మానాన్నలకు ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు.
అలాంటిది ఇప్పుడు రజినీ కోసం నేను మా నాన్నను ఎదిరించలేను’ అన్నాడు.
శ్రీధర్ వాళ్ల అమ్మ మాత్రం ‘మా ఇంట్లో మహిళలకు ఎలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. ఒక యంత్రంలా అన్నీ చేసుకుపోవాలి. చెప్పినట్టు వినాలి. ఇన్నేండ్లలో మీ ప్రవర్తన నచ్చడం లేదని చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. ఇన్ని రోజులకు నా కోడలు ఆ పని చేసింది. ఆమె చేసిన దాంట్లో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. నేనైతే ఈ ఇంట్లో తప్పును తప్పు అని కూడా చెప్పలేను. నేను మాత్రం నా కోడలిని నాలా ఆత్మాభిమానం చంపుకొని బతకమని చెప్పలేను’ అంది.
అంతా విన్న తర్వాత శ్రీధర్‌తో ‘మీరు మీ పద్ధతులు మార్చుకోవాలి. నీ భార్యకు మీ నాన్న ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో ‘ఇలాగే ఉండాలి’ అంటూ గీతలు గీస్తే భరించలేరు. అయినప్పటికీ రజిని మీ ఇంట్లో ఎలాగో సర్దుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఆమెను ఎంత అగౌరపరిచినా ఆమె మీతో అభిమానంగానే ఉంటుంది. కానీ మీరు మరీ ఇబ్బందులు పెడుతున్నారు. మీకు భార్య కావాలంటే మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆయన ఆలోచనా ధోరణి సరైనది కాదని మీరే చెప్పాలి. ముందు మీరూ మీ నాన్న మహిళలను గౌరవించుకోవడం నేర్చుకోండి’ అని చెప్పాము.
శ్రీధర్ తండ్రితో ‘మీరు కోడలిని కన్న కూతురిలా చూసుకోవాలి. ఇంట్లో పనులు రాకపోతే మెల్లగా నేర్చుకుంటుంది. అనవసరంగా మీరు జోక్యం చేసుకొని మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంతోషంగా ఉండాల్సిన సమయంలో కొడుకూ, కోడలిని ఇబ్బందులుపెడుతున్నారు. మీరే విన్నారు కదా మీ వల్ల మీ భార్య ఎంత ఇబ్బంది పడ్డదో. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే మీ కొడుకు జీవితం మీరే చేతులారా నాశనం చేసినవాళ్లు అవుతారు. రజిని ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీ ఇష్టం’ అని చెప్పాము.
రజినీతో ‘మీరు తొందరపడకండి. ఓ ఆరు నెలలు చూద్దాం. నీ భర్త, మామలలో మార్పు రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. మీ మామయ్యలో మార్పు రాకపోతే మీ భార్యాభర్తలు వేరేగా ఉండొచ్చు. ఏ నిర్ణయమైనా ఆరు నెలల తర్వాత తీసుకోవచ్చు’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051
కోడలంటే అలుసెందుకు..?
- Advertisement -
- Advertisement -