No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిఅగ్రరాజ్యం..'కపట'నీతి

అగ్రరాజ్యం..’కపట’నీతి

- Advertisement -

తనకుతాను అగ్రరాజ్యంగా చెప్పుకుంటూ.. ప్రపంచ దేశాలకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నానని భావిస్తున్న అమెరికా.. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-గాజా యుద్ధాల పట్ల ద్వంద నీతిని ప్రదర్శిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పరోక్ష సహకారం అందిస్తున్నారనే ఆరో పిస్తూ.. ట్రంప్‌ ఇప్పటికే భారత్‌పై యాభై శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యాకు సహకరించే చైనాతోపాటు ఇతర దేశాలపైనా చర్యలుంటాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో సామాన్య పౌరుల మరణాల గురించి ప్రస్తావిస్తున్న అమెరికన్‌ ప్రెసిడెంట్‌కు.. ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంలో మరణిస్తున్న చిన్నారులు, మహిళలు, వృద్ధుల మృత్యుఘోష వినిపించడం లేదా? ఆకలితో అలమటిస్తూ పోషకాల లోపంతో మరణిస్తున్న చిన్నారుల ఆర్తనాదాలు చెవికెక్కడం లేదా? స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటూ ప్రపంచానికి ప్రవచనాలు బోధించే అమెరికా.. రెండు ప్రధాన యుద్ధాల పట్ల ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నది. అగ్ర రాజ్యం మాటలు, చేతల మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపి స్తున్నది. దీంతో అగ్రరాజ్యం నైతికతలో రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని స్పష్టంగా అర్థమవుతున్నది.
నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్‌ పావులు కదుపు తున్నదని తెలియగానే 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారం భించింది.

అయినా 2022లో ఉక్రెయిన్‌ నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయగా.. దాడులను మరింత ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రరాజ్యాన్ని సైతం హెచ్చరించింది. అయితే సభ్యత్వం ఇవ్వాలా?వద్దా? అనే దానిపై నాటో దేశాలు ఇప్పటికీ తమ నిర్ణయాన్ని ప్రకటించకపోయినా.. రష్యా దాడులను అవి ఖండించాయి. రష్యా చర్యలను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, ఐరోపా భద్రతకు ముప్పుగా అభివర్ణించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా చమురు, గ్యాస్‌, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తున్నాయి. అంతేకాకుండా అమెరికాతోపాటు జర్మనీ, బ్రిటన్‌, నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, లిథువేనియా వంటి యూరోపియన్‌ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, యాంటీ ట్యాంక్‌ క్షిపణులు.. డ్రోన్లు, ఇతర ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఆర్థిక సహకారమందిస్తున్నాయి. మరోవైపు రష్యా ఆస్పత్రులు, పాఠశాలలపైనా దాడులు చేస్తున్నదని గగ్గోలు పెడుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత అంటే 2023 అక్టోబర్‌ లో ఇజ్రాయిల్‌- గాజా యుద్ధం ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. పాఠశాలలు, ఆస్పత్రులు, సామాన్య పౌరులు నివసించే ఇండ్లు అనే తేడా లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నది. చిన్నారులు, మహిళలు, వృద్ధులను సైతం బలితీసుకుంటున్నది. మాన వతా సహాయం అందకుండా అడ్డుగోడగా నిలిచి ఆకలి మరణాలకు కారణమవుతున్నది. కానీ ఇవేమీ అగ్రరాజ్యం అమెరికాకు కనిపించడం లేదు. అయితే గాజాపై దాడులను కనీసం ఖండించని అమెరికా.. మరోవైపు ఇజ్రాయిల్‌కు బిలియన్‌ డాలర్ల ఆయుధాలను సరఫరా చేస్తున్నది. యుద్ధ నేరాల విషయంలో రష్యాపట్ల కఠినంగా వ్యవహరించిన అమెరికా.. ఇజ్రాయిల్‌ విషయంలో మాత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మం డలిలో వచ్చిన తీర్మానాలను వీటో చేసింది. ఇజ్రాయిల్‌ యథేచ్ఛగా అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కనీసం విమర్శించనూలేదు.

గాజాతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో మరణాల శాతం చాలా తక్కువ. 2023 అక్టోబర్‌ నుంచి గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడుల్లో సుమారు 60వేల నుంచి 80 వేలమంది వరకు మరణిం చారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేచర్‌ నివేదికల ద్వారా స్పష్టమవు తున్నది. ఇందులో సుమారు పద్దెనిమిది వేల మంది చిన్నారులు ఉండగా, పదిహేను వేల కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. రెండు వేల మంది వరకు వృద్ధులు ఉన్నట్టు అంచనా. పందొమ్మిది లక్షల మంది నిర్వాసితులయ్యారు. గాజాలో మరణించిన వారిలో 59.1 శాతం మహిళలు, చిన్నారులు, వృద్ధులున్నారని లాన్సెట్‌ ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే వందలాది మంది ఆకలితో మరణించినట్టు పలు రిపోర్టుల ద్వారా తెలుస్తున్నది. ఇందులోనూ ఎనభై శాతం మంది చిన్నారులు ఉండడం మనసులను కలచివేస్తున్నది. అదే ఉక్రెయిన్‌లో పౌరమరణాలు పకొండు వేల వరకు మాత్రమే ఉంటాయని ఒక అంచనా. అంటే గాజాతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో మరణాల శాతం చాలా తక్కువ.

మానవ హక్కుల విషయంలో రష్యాను పదేపదే విమర్శిస్తున్న అమెరికా.. ఇదే ఇజ్రాయిల్‌ విషయంలో మాత్రం మౌనంగా ఉండడం అగ్రరాజ్యం ద్వంద్వ నీతికి నిదర్శనంగా నిలుస్తున్నది. అంటే మానవ హక్కులు అనేది రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు ఒక ఆయుధంలా మాత్రమే పనికొస్తున్నాయనేది స్పష్టమవుతున్నది. ఇప్పటికే బ్రెజిల్‌తో పాటు మరికొన్ని దేశాలు అమెరికా ద్వంద్వ వైఖరిని విమర్శించాయి. అగ్రరాజ్యం వహిస్తున్న ఈ వైఖరి అంతర్జాతీయ న్యాయవ్యవస్థ, నైతికతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నది. ఇది ప్రపంచశాంతి, స్థిరత్వానికి ఎప్పటికైనా ముప్పే. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల పట్ల అందరికీ సమానమైన విధానం అవలంభించడం ద్వారా మాత్రమే అమెరికా అంతర్జాతీయంగా తన విశ్వసనీయతను నిరూపించుకోగలదు.
– మహమ్మద్‌ ఆరిఫ్‌ 7013147990

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad