– మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లాలో హైటెక్ తరహాలో నిర్మించనున్న నూతన బస్టాండ్‌ను ఆరు నెలల్లోపు పూర్తి చేసి ప్రారంభించి జిల్లా ప్రజల దశాబ్ధాల కలను నెరవేరుస్తామని రోడ్డు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం ములుగు జిల్లాకు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు భారీ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి రూ.4.80కోట్లతో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తామిచ్చిన హామీలనే కాకుండా నూతన పథకాలనూ అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో 1989లో నిర్మించిన బస్టాండ్ పరిస్థితి బాగాలేదని మంత్రి సీతక్క తెలుపగానే నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. మంగపేట మండలంలో రూ.50 లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మంగపేట మండల కేంద్రంలో రూ.7కోట్లతో చేపట్టనున్న బస్ డిపో పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమనగర్ వద్ద గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్, వైద్య కళాశాల ఉన్న కారణంగా ఎకరం స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్టు హామీ ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళా సంఘాలతో 600 బస్సులను కొనుగోలు చేసి బస్సు యజమానులుగా చేశామని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి నేడు రాష్ట్రంలో బీసీల పాలిట దేవుడుగా మారి 42 శాతం రిజర్వేషన్ సాధించడం గొప్ప విషయమని అన్నారు. ములుగు ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారడంతో ఎలాంటి పనులకైనా సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరిమణులు రామప్ప సందర్శన దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అనంతరం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ సుందరకీకరణ పనులనూ మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ బానోతు రవిచందర్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ రాజ్, డిప్యూటీ ఆర్‌ఎంఓ భాను కిరణ్, ఆర్డీవో వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్న, రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.
కులమత రాజకీయాలు తగవు : మంత్రులు
కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం తగదని, రాహుల్ గాంధీ పోరాటంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కులగణన ప్రకటన చేశారని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని లీల గార్డెన్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుందని, ఇది దుర్మార్గమైన ఆలోచన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బహుళజాతి సంస్థల కోసం ఆలోచిస్తున్నదే తప్ప దేశ ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి తమ పార్టీ ప్రజలకందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ఇన్‌చార్జిలు కైలాష్ నేత సాంబయ్య, జిల్లా గ్రంథమాల సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.
హైటెక్ తరహాలో ములుగు ‘బస్టాండ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES