Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎమ్మెల్యే ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు...

ఎమ్మెల్యే ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌టక్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ అరెస్టుకు ముందు దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.

సోదాల సందర్భంగా సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీ కూడా ఉంది. అంతేకాకుండా, నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేసి, వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. వీరేంద్ర సోదరుడు కేసీ తిప్పేస్వామి, కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ దుబాయ్ నుంచే ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కింగ్567, రాజా567, రత్న గేమింగ్ వంటి పలు ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లను వీరేంద్ర నిర్వహిస్తున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. గోవాలోని పప్పీస్ కాసినో గోల్డ్, ఓషన్ 7 కాసినో, బిగ్ డాడీ కాసినో సహా పలు క్యాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది.

గ్యాంగ్‌టక్‌లో ఒక క్యాసినో ఏర్పాటు కోసం వీరేంద్ర భూమిని లీజుకు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు కూడా ఈడీకి సమాచారం అందింది. నిందితుడిని గ్యాంగ్‌టక్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో పెద్ద మొత్తంలో నిధులను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad