పరిసర సోదర భావం, ఐక్యత ఆకాంక్షిస్తూ మనం దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా వినాయక చవితి జరుపుకుంటాం. ఈ పండుగను భిన్న మత, కుల, జాతి, ప్రాంత వర్గ ప్రజలు అత్యంత ఆనందంగా నిర్వహించుకుంటారు. ‘భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వం’ అని చాటిచెప్పేలా ఈ పండుగను ప్రతీ ఒక్కరు సెలెబ్రేట్ చేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట గణేశ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున లక్షలలో ఖర్చు పెడుతూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
నగరాలలో, పట్టణాలలో గ్రామాలలో వినాయక చవితి సందడి నెలకొంది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులను పురస్కరించుకొని వినాయక మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగమయ్యారు. ప్రతిష్ఠకు గణనాథులను తరలిస్తున్నారు. వినాయక చవితి పండుగ మొదలుకొని 9 రోజుల పాటు వినాయకులను పూజిస్తున్నాం. అయితే ఈ సంబరాల వెనుక పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని సైతం మనం గుర్తెరగాల్సిన బాధ్యత ఉంది. వినాయకుడి పూజ ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంత ముఖ్యమని భావించాల్సిన బాధ్యత ఉన్నది. వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పియుపి రసాయనాలు, రగులతో గణేష్ బొమ్మలు ప్రతిష్టించడం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, సింథటిక్ రంగులతో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్ ఆర్సానిక్ తదితర విషపూరిత రసాయనాలను విగ్రహాల్లో వాడుతున్నారు. మళ్ళీ వాటిని నీటిలో నిమజ్జనం చేస్తుండడంతో వాటి నుండి వెలువడే రసాయనాలు నీటిని కలుషితం చేస్తాయి. అవి నీటిలో ఆక్సిజన్ లెవల్‌ని తగ్గించి జలసారాలకు మనుగడ లేకుండా చేస్తుంది. వీటితో జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుంది. రసాయనాలు, రంగులతో తయారు చేసిన విగ్రహాల కంటే మట్టి వినాయకులే శ్రేష్టమని మేధావులు, పర్యావరణ వేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే యువత మాత్రం కలర్ విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో భవిష్యత్తులో ప్రమాదం తప్పదని మేధావులు చెప్తున్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛింత సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షణలో ఉండాలని, మండపాల వద్ద కరెంటు ఏర్పాట్లలో పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా డీజే, అతి సౌండ్ వచ్చే సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.
గణపతి మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాలలో ఏర్పాటు చేసే గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసు ముందస్తు సమాచారం తోపాటు https://policeportal.tspolice.gov.in లింక్‌తో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని పోలీస్ అధికారులు చెపుతున్నారు. గణేష్ విగ్రహాలు పెట్టే ప్రతి ఒక నిర్వాహకులు మండపం, సభ్యుల పూర్తి వివరాలను అన్ని నమోదు చేసుకొని ఒక సెట్ జిరాక్స్ పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ప్రమాదం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (ూ.ఉ.ూ) విగ్రహాల తయారీలో జిప్సమ్, సల్ఫర్, పాస్పరస్, మెగ్నీషియం, మెర్క్యూరీ, లెడ్, కాడ్మియమ్, ఆర్సెనిక్, కార్బన్ వంటి భార లోహాలు, ఇతర హానికర రసాయనాలు ఉపయోగించబడతాయి. దీంతో ూ.ఉ.ూ. నీటిలో కరగడానికి చాలా రోజులు పడుతుంది. అంతేకాక నీటిలో కార్బన్‌డై అక్సైడ్ శాతాన్ని పెంచుతుంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిని బాగా తగ్గించి, ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల కుంటలు, చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలు విషతుల్యమై అనేక రకాల జలచరాలు మత్యువాతపడి అంతరించి పోతున్నాయి. ఇటువంటి కలుషిత నీరు భూగర్భ జలాలను చేరి తద్వారా మొక్కలు, పంటలకు కూడా హానికల్గిస్తుంది. జలచరాలు, పంటల ద్వారా మానవులకు చేరి, ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాస సమస్యలు, టైఫాయిడ్, క్యాన్సర్ హెపటైటిస్, కలరా, గాస్ట్రిక్ అల్సర్, డయేరియా, చర్మవ్యాధులు, కళ్ళ సమస్యలు, వైద్యానికి కూడా అంతుచిక్కని అనేక రకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.
మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడుదాం
మట్టి విగ్రహాలతో పూజించటం వల్ల పర్యావరణాన్ని ఎలాంటి ముప్పు ఉండదు. ఖర్చూ తక్కువే అవుతుంది. నీటిలో నిమజ్జనం తరువాత విగ్రహాలు కరిగిపోతాయి. రసాయనాలతో చేసిన ప్రతిమలతో పోలిస్తే మట్టి ప్రతిమలను తక్కువే వాడుతున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా మట్టి ప్రతిమల మండపాలు ఐదు శాతానికి మించడం లేదు. మట్టి వినాయకులను బంకమట్టితో తయారు చేసి, ఎలాంటి రంగులు రసాయానాలు పూయరు. దీంతో నీటి కాలుష్యం ఉండదు. కర్రలు, వరిగడ్డి, మట్టి ఇవన్నీ నీటిలో కరుగుతాయి. మళ్లీ ఎరువుగా తయారవుతాయి. పట్టణాలు, పల్లెలు ఇలా అన్ని చోట్లా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని, మట్టి వినాయకులే అన్ని విధాలా శ్రేష్టం అని పర్యావరణవేత్తలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.
పర్యావరణ హిత నిమజ్జనం
మట్టి విగ్రహాలను ప్రతిష్టించిన చోటే నీటితో అభిషేకించి కరిగించే ‘పర్యావరణ హిత నిమజ్జనం’ చేయడం ద్వారా నీటి వనరులు కలుషితం కావు. శబ్ద, వాయు కాలుష్యం కలిగించే ఊరేగింపులు (ట్రాఫిక్ అంతరాయాలు) నిషేదించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండగలుగుతాం. ప్రజలకు భక్తి ఎంత ముఖ్యమో పర్యావరణం కూడా అంత ముఖ్యం కాబట్టి యువత దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆలోచించాలని మేధావులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
– గడగోజు రవీంద్ర చారి, 9848772232