రామ్ అల్లరి పిల్లాడు. అతనికి మొబైల్ లేదు, కానీ ఊరి వార్తలు మాత్రం అందరికంటే ముందే తెలిసేవి.
ఒకరోజు స్నేహితుడు మహేష్ కొత్త ఫోన్ తెచ్చుకున్నాడు.
మహేష్: రా రామ్ ఈ ఫోన్‌లో AI ఉంది!
రాము: అయితే అది గేమ్ ఆడుతుందా…
మహేష్ ఫోన్‌లో గేమ్ చూపించాడు. రామ్ ఆడుతుండగా, ఒక లెవెల్ ఓడిపోయాడు. వెంటనే ఇలా అన్నాడు… చూడూ, ఫోన్ కూడా నన్ను ఓడించలేక భయపడి ఆఫ్ అయిపోయింది! (అసలు విషయం బ్యాటరీ అయిపోయింది )
తర్వాత రోజు రామ్ పాత పేపర్లు, బ్యాంబూ కర్రలు తెచ్చి గాలి పటం ఎగరేశాడు. మొత్తం పిల్లలు వచ్చి ఆడారు. మహేష్ ఫోన్‌ను పక్కన పెట్టి పటాన్ని పట్టుకున్నాడు.
”చూడు, నా పటానికి నెట్‌వర్క్ అవసరం లేదు, సిగల్ కూడా ఫుల్!” అన్నాడు రాము.
మహేష్ నవ్వి ”ఫోన్‌లో సిగల్ కట్ అయితే టెన్షన్, గాలిపటానికి గాలి కట్ అయితే ఫన్!” అన్నాడు.
ఈ రోజుల్లో సమాచారం అందుకోవడం, తెలుసుకోవడం చాలా సులభమయింది. పూర్వం రాతపూర్వకంగా లేదా మామూలు ఫోన్ వినియోగం ద్వారా తెలియ జేసుకునేవాళ్లు. ఇప్పుడు క్షణాల్లో సమాచారం సమాజిక మాధ్యమాల ద్వారా చేరవేయగల్గుతున్నారు. కారణం మొబైల్ ఫోన్ వాడకం. మొబైల్ ఫోన్ రావడంతో సమాచార వ్యవస్థలు పెను మార్పులు వచ్చేశాయి. ఎలాంటి సమాచారమయినా చిటికెలో అందుకుంటున్నారు, పంపగల్గుతున్నారు. మొబైల్స్ రావడానికి ముందు పేజర్స్ ఉండేవి. అవి కేవలం చిన్నపాటి సమాచారానికే వినియోగించారు. ఆ వెంటనే స్మార్ట్ ఫోన్లు అన్నిరకాల సౌకర్యాలతో వచ్చాయి. అంతే యువత అమాంతం దాసోహమయింది. అందులో అనేక రకాల యాప్‌లు అనతికాలంలోనే వచ్చి చేరాయి. దీంతో మొబైల్ మరింత ఆకర్షితులయ్యారు. ఇపుడు యువతంతా ఆ మోజులో ఇతరులను మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇందులో సందేహం లేదు. కారణం కేవలం సమాచారం అందుకోవడం, పంపడం మాత్రమే కాదు ఏకంగా సినిమాలు, వీడియోలు చూడగల్గుతున్నారు. కాపీ చేయగల్గుతున్నారు. అన్నివిధాలా గొప్ప ఎంటర్ టైన్మెంట్, స్నేహవారధిగా మారిపోయింది.
అసలీ మొబైల్ అందరికీ అంతగా అవనరమా అంటే… ఇప్పటి తల్లిదండ్రులు అవసరమే అంటున్నారు. పిల్లల్ని దూరప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చేర్చడం, తమ తమ ఆఫీస్, వాణిజ్య వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఎంతో ఉపకరిస్తోంది. అయితే పిల్లలకు అందులోనూ స్కూలు పిల్లలకు అంత ఖరీదయిన స్మార్ట్ ఫోన్ అందివ్వడం వల్లనే చదువుపై దష్టి తగ్గిపోతోందన్న ఫిర్యాదులు చాలానే వుంటున్నాయి. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఏకంగా తరగతి గదిలోకి వచ్చేసింది. పిల్లలు పుస్తకాల మధ్యలో పెట్టుకుని సమాచారాల రాకపోకలు సాగిస్తున్నారని టీచర్లే ఫిర్యాదు చేస్తున్నారు.
తల్లిదండ్రులు ఈ విషయంలో స్వీయ విచారణ చేపట్టి పిల్లల్ని దారిలో పెట్టాలి. ఆ బాధ్యతను వీలైనంతగా తీసుకోవాలి. అంతేకాని టీచర్లను, తోటి విద్యార్థులను తిట్టుకుని ప్రయోజనం లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం కొంపముంచుతుంది. పిల్లలకు అంత ఖరీదయినది కొనివ్వడం అవసరమా? మామూలు సమాచారం తెలుసుకోవడానికి వారికి మామూలు మొబైల్ ఇస్తే సరిపోతుంది గదా? స్మార్ట్ ఫోన్లు ఇతరులు వాడుతున్నారన్న కారణంగా కొనివ్వడమే వారిని దానికి బానిస చేయడం అవుతోంది. దానివల్ల చదువుపట్ల శ్రద్ధ దెబ్బతింటుందన్న సంగతి గ్రహించాలి, స్కూలు వారు చేస్తున్న ఫిర్యాదులు తల్లి దండ్రులు ఇలా పట్టించుకోవాలి…
1. మొబైల్ కేవలం అవసరార్థం ఉపయోగించేలా చూడాలి.
2. ఎక్కువగా వాడుతున్నారని తెలిస్తే, వాడనీయకండి.
3. సాధ్యమైంతవరకూ స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి.
4. చాటింగ్ స్నేహాన్ని పూర్తిగా అరికట్టండి. స్నేహితుల్నీ హెచ్చరించండి.
5. ముందు స్వేచ్ఛనిచ్చి తర్వాత నియంత్రణ దుర్లభం.
మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. అందుకు మొబైల్ వాడకాన్ని అరికట్టడమే తొలిఅడుగు. ఆలోచించండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
మొబైల్ అవసరమా?
- Advertisement -
- Advertisement -