Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeచైల్డ్ హుడ్తేనె మాటలు

తేనె మాటలు

- Advertisement -

అనగనగా ఒక అడవి. రకరకాల పూల మకరందాన్ని సేకరించి, చక్కటి తేనె పట్టును చేసే తేనెటీగల గుంపు ఒకటి ఆ అడవిలో ఉండేది. అవి తమకి అనువైన సమయంలో ఒక చెట్టు మీద తేనె పట్టును చేశాయి.
ఓ రోజు దారిలో పోతున్న పిల్ల ఏనుగుల గుంపు ఆ తేనెపట్టును చూశాయి. వాటి నోరు ఊరింది. ఎలాగైనా తియ్యటి తేనె తాగాలనుకున్నాయి. తేనె పట్టును అందుకోవడానికి ప్రయత్నించాయి.
ఎత్తులో ఉన్న తేనె పట్టు వాటికి అందలేదు. బాగా ఆలోచించి ఒక ఏనుగు మీద మరో ఏనుగు ఎక్కి ఎలాగోలా తేనెపట్టును పట్టుకునే ప్రయత్నం చేశాయి.
ఏనుగుల ఆకారం చూసిన తేనెటీగలు భయపడి పారిపోయాయి.
‘తేనెటీగల పని తీరికలేని పని అంటారు. అలా కష్టపడి సంపాదించిన తేనె ఏనుగుల పాలు అవుతున్నాయి’ అని కన్నీళ్లు పెట్టుకున్నాయి.
ఈ విషయం తెలిసిన రాణి తేనెటీగ వచ్చి ”ఏనుగుల మీద ఎదురు దాడి చేయకుండా ఏడుస్తున్నారు దేనికి?” అని అడిగింది.
”అంత పెద్ద ఏనుగులు మాపైన దాడి చేస్తే మేము బతికిబట్ట కట్టగలమా? వాటి కాళ్ళ కింద పడితే నుజ్జునుజ్జు అయిపోమా” అని ఏడుస్తూ చెప్పాయి
”మీ తెలివి మండా… మనకి, మన ప్రాణం ఎంత తీపో.. ఏనుగులకి కూడా వాటి ప్రాణం మీద అంతే తీపి. వాటిని చూస్తే మనకి భయం ఎలాగో, మనల్ని చూస్తే వాటికి కూడా భయం ఉంటుంది. అవి ఆకారంలో గొప్పవి కావచ్చు. చెట్లను, కొమ్మలను సులభంగా విరచవచ్చు. అయితే అవి మనలాగా పూలనుంచి మకరందాన్ని సేకరించి తేనేపట్టులను తయారు చేయగలవా?” అని తేనెటీగలను నిలదీసింది.
కళ్ళు పెద్దవి చేసిన తేనెటీగలు ”తేనె చేయడం మనకి పుట్టుకతో వచ్చిన విద్య. మనం మాత్రమే తేనెను చేయగలం. ఏనుగులు ఆకారంలో ఎంత పెద్దవైనా మనలాగా తేనెపట్టును తయారు చేయలేవు. కాకుంటే ఇలా మనం చేసిన తేనెను అవి దొంగిలించగలవు కానీ వాటికి తయారు చేసే నైపుణ్యం లేదు” అని కలిసికట్టుగా చెప్పాయి.
”అయితే క్షణం ఆలస్యం చేయకండి. మన తేనెను దొంగిలిస్తున్న ఏనుగులను కుట్టినచోట కుట్టకుండా కుట్టండి” అని రాణి పిలుపు ఇచ్చింది.
”ఏనుగుల తొండాలు పెద్దవి కదా. ఏనుగులు కసికసిగా వాటిని మన మీదికి విసిరితే మనం ఎక్కడో దూరంగా వెళ్ళి పడతాం కదా” అని అనుమానం వ్యక్తం చేశాయి తేనెటీగలు.
రాణి తేనెటీగ నవ్వుతూ ”వాటి తల మీద, కాళ్ళ మీద గట్టిగా కుట్టి వాటి తొండాలకు, తోకకీ దొరకకుండా ఎగురుకుంటూ వెళ్ళండి. మనం ఆకాశంలో ఎగిరినట్లు ఏనుగులు ఆకాశంలో ఎగురలేవు కదా” అని ధైర్యం చెప్పింది.
అంతే… అన్ని తేనెటీగలూ మూకుమ్మడిగా ఏనుగులపైన దాడి చేశాయి.
”కుయ్యోమొర్రో” అంటూ ఏనుగులు పరుగులు తీశాయి. నేరుగా వెళ్ళి ఏనుగుల రాజుకు విషయం చెప్పాయి.
”దొంగతనం చేయడం తప్పు. మనం వెళ్ళి మంచిగా అడుగుదాం. అవి కచ్చితంగా ఇస్తాయి” అని చెప్పిన ఏనుగుల రాజు పిల్ల ఏనుగులను తీసుకుని రాణి తేనెటీగను కలిసింది.
”తేనె కావాలని మా తేనె పట్టులను నాశనం చేస్తే ఇలాగే జరుగుతుంది. మీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే వచ్చి మంచిగా, మెత్తగా అడగండి. మేమే తేనెను ఇస్తాం” అని చెప్పింది.
‘మెత్తగా అడిగితే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి’ అని తెలుసుకున్న ఏనుగులు ‘అలాగే’ అని తలలు ఊపాయి.
అన్ని ఏనుగులకూ రాణి తేనెటీగ అరటి ఆకుల్లో తేనె పోసి పంచింది. తేనెటీగలు పాటలు పాడుతూ ఉండగా, ఏనుగులు తప్తిగా తేనె తాగాయి.

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు, 9393662821

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad