Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసోపతిప్రశ్నించడం నేర్పే కథలు చెప్పిన 'వనజాత'

ప్రశ్నించడం నేర్పే కథలు చెప్పిన ‘వనజాత’

- Advertisement -

పిల్లల కోసం కవులు, రచయితలు ప్రతి సందర్భంలో ఆలోచిస్తారు, రచనలు చేస్తారు. మన తొలితరం, మలితరం రచయితలు బాలల కోసం అనేక రచనలు చేశారు. తమకు తెలిసినదానిని బాలలకు అందించి వారిని చైతన్య పరిచేందుకు తమదైన పద్ధతిలో పనిచేశారు. నేటి రచయితల్లో కూడా ఆ దిశగా పనిచేస్తున్నవారు లేకపోలేదు. ఇటు వృత్తిరీత్యా కొందరు ఆదిశగా పనిచేస్తే, మరికొందరు వృత్తి ప్రవృత్తులరీత్యా కృషిచేస్తున్నారు. కథా రచయిత్రిగా, కవయిత్రిగా, నవలాకారిణిగా పరిచితులు శ్రీమతి కోట్ల వనజాత. వీరు 10 ఏప్రిల్‌, 1967న మహబూబ్‌నగర్‌ జిల్లా నిడమనూరు మండలం లోని తుమ్మనూరులో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి కీసర లక్ష్మమ్మ – శ్రీ కీసర రంగారెడ్డిలు. వీరు ఎం.ఎ., బి.ఎడ్‌. చదివారు. ప్రస్తుతం జిల్లా పౌర సరఫరాల అధికారిగా రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నారు. వనజాత జీవన సహచరులు ప్రసిద్ధకవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి.
వనజాత కథల్ని ముట్టుకుంటే మనిషి తగలకుండా ఉండడు అన్నది జలజం ఉవాచ. వీరి కథలన్నీ మనిషి కేంద్రంగా వచ్చినవే. దీనికి తోడు అక్షరమక్షరాన సహజత్వం వీరికథల్లో సహజాలంకారం. ముఖ్యంగా తెలంగాణ జీవితాలను, సంఘర్షణలతో పాటు తన చుట్టూ ఉండే వ్యక్తులు, సంఘటనలను రచనలుగా మలిచిన శ్రీమతి కోట్ల వనజాత మొదటి పుస్తకం విద్యార్థుల కోసం రాసిన కథలు కావడం విశేషం. ‘ఇత్తు’, ‘మైదాకు వసంతం’ వనజాత కథా సంపుటాలు. ‘ఊరుగాని ఊరు’ వీరి నవల. దాదాపు అన్ని పక్రతిల్లో వీరి కథలు అచ్చయ్యాయి. రచనలు గౌరవ సత్కారాలతోపాటు పలు పురస్కారాలు అందుకున్నాయి. వాటిలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇచ్చే ‘నోముల కథా పురస్కారం’, ‘అంపశయ్య నవీన్‌ తొలి ఉత్తమ నవల పురస్కారం’తో పాటు ‘అల్లాడి వెంకటసుబ్బు అవార్డు’, ‘అమృతలత అవార్డ్‌’ వంటివి కొన్ని. ‘మైదాకు వసంతం’ నవల శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు పుస్తక ప్రచురణ సత్కారం అందుకుంది.
ఇంటి నుండి, బడి నుండి ఏదైనా మొదలవ్వాలన్నది ఈ రచయిత్రికి బాగా తెలుసు. అధికారిణియే కాకుండా అమ్మ కదా! 2007లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్ఫోర్స్‌మెంట్‌ డిప్యూటి తహసిల్దార్‌గా వున్నప్పుడు వనజాత ‘విద్యార్థుల వినియోగదారులు కథలు’ సంపుటి తెచ్చారు. ఇది ఐదు కథలు, ఒక నాటిక సంపుటి. ఇందులోని కథలన్నీ వినియోగదారుల చుట్టూ, వినియోగదారుల ఫోరం చుట్టూ తిరుగుతాయి. ‘కరెంటు మోటారు కథ’, ‘రైతన్నల విజయం’, ‘చిట్టెమ్మ చీటి కష్టాలు’, ‘వికాసంలేని విద్యాలయాలు’, ‘నీ చేతి మాత్ర! వైకుంఠ యాత్ర’, ‘జయకాలనీ’ ఇందులోని కథలు కాగా ‘కేబుల్‌ టి.వి’ నాటిక. నిరక్షరాస్యత, పేదరికం, అవగాహనా రాహిత్యం వంటివాటివల్ల యూరోపియన్‌ దేశాలతో పోల్చిచూస్తే మన దగ్గర వినియోగదారుల చైతన్యం తక్కువే. వనజాత ఆ దృష్టితోనే బహుశా ఈ కథలు తెచ్చారు. ప్రశ్నించడం నేర్పడం, హేతువుతోపాటు వైజ్ఞానిక, సామాజిక, వినియోగదారుల చేతన వంటివి కల్పించడం అందరితో సాధ్యమయ్యేపని కాదు. దాన్ని సుసాధ్యం చేశారు వనజాత. మొదటికథ ‘కరెంటు మోటారు కథ’ అనేక అంశాల సమాహారం. రాజు, రవి, శంకర్‌, పాండు, కృష్ణ అనే ఐదుగురు దోస్తుల గ్యాంగ్‌ను భూమికగా చేసుకుని అవసరమైన, ఆలోచించే విషయాలను చెప్పారు రచయిత్రి. కొత్త మోటారు కొని వ్యవసాయ పంపుసెట్టుకు అమర్చగా అది షాకు కొడుతుంది శంకర్‌ తండ్రికి. ఈ నేపథ్యంగా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునితో ‘మనం కొత్త వస్తువుల వలన మనకు అనుకున్న ప్రయోజనం నెరవేరకపోగా, నష్టం జరిగితే ఆ వస్తువు తయారీదారుడు అమ్మకం దారులే బాధ్యులు. దానికి వాని నుండి మనం నష్టపరిహారం పొందవచ్చు’ అని పిల్లలకు అవగాహన ఒకచోట కల్పిస్తే, మరోచోట వినియోగదారుడు అంటే ఎవరు అన్న ప్రశ్నకు పిల్లలకు తెలిసేలా ”ఏదైనా వస్తువును గానీ, సేవలనుగానీ తమ డబ్బుతో పొందేవారిని వినియోగదారులంటారు” అని చెబుతారు రచయిత్రి.
‘రైతన్నల విజయం’ నకీలీ ఎరువుల వల్ల మోసపోయిన రైతులు 1986 వినియోగదారుల చట్టం వల్ల ఎలా తిరిగి నష్టపరిహారం పొందారో తెలిపే కథ. అంతేకాదు ఇది సమిష్టిగా ఒక సమస్యపై అందరూ కలిసికట్టుగా పోరాడితే, ఐకమత్యంగా ఉంటే దేన్నైనా ఎలా సాధించవచ్చో చేప్పేకథ కూడా! కేవలం రైతులు, ఇతర సమస్యలపై తన దృష్టిని కేంద్రీకరించి ఊరుకోలేదు రచయిత్రి. అత్యధికంగా ఆర్థికమోసాలు, నష్టాలను ఎదుర్కునేది గ్రామీణ మహిళలే. అందులోనూ వాళ్ళలో మెజారిటీ వర్గానికి ఎదురయ్యేది చీటీ మోసాలు. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో, ఎలా సాధించుకోవచ్చో చెబుతూనే ఎటువంటి కేసు ఎన్ని రోజులలో పరిష్కారం అవుతుందో చెబుతారు ‘చిట్టెమ్మ చీటి కష్టం’ కథలో. ఇలా ప్రతి అంశాన్ని ప్రశ్న, సాధన, మార్పులకు కేంద్రంగా చేసుకుని కోట్ల వనజాత ఈ కథలను రాయడం కేవలం పిల్లలను చైతన్యపరచడం వరకే ఆగిపోలేదు. పెద్దలకు అవగాహనతో పాటు ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న ఒక గొప్పదారిని చూపాయి. నామట్టుకు నాకు ఒక సమస్యకు ఇందులోని ఒక కథ చక్కని పరిష్కారం చూపింది కూడా! ఇంత చక్కని ‘పనికొచ్చే’ కథలను పిల్లలకు ‘ప్రశ్నించడం నేర్పే ఒక దివిటి’గా అందించిన కోట్ల వనజాత గారికి జయహో! జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad