Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుప్రిన్సిపాల్‌పై కోపంతో విద్యార్థులపై విష ప్రయోగం

ప్రిన్సిపాల్‌పై కోపంతో విద్యార్థులపై విష ప్రయోగం

- Advertisement -

నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన టీచర్‌
అస్వస్థతకు గురైన 11మంది విద్యార్థులు
పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ
నలుగురు సిబ్బంది సస్పెన్షన్‌
భూపాలపల్లి అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఘటన

నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిద్దాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. ప్రిన్సిపాల్‌తో ఉన్న అంతర్గత వివాదంతో పాఠశాలలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపాడు.. ఆ నీటిని తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. అత్యంత దారుణమైన ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి..

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాలుర అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్‌ మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది.. ప్రిన్సిపాల్‌పై కోపంతో సైన్స్‌ టీచర్‌ కుట్ర పన్ని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపాడు. ఆ నీటిని తాగిన 11మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం టిఫిన్‌ తిన్న తరువాత వారంతా వాంతులు చేసుకున్నారు. వెంటనే సిబ్బంది విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్‌ ఫిర్యాదుతో కలెక్టర్‌తోపాటు ఎస్పీ విచారణ చేపట్టారు. నీటిలో సైన్స్‌ టీచర్‌ రాజేందరే పురుగుల మందు కలిపినట్టు విద్యార్థులు కలెక్టర్‌, ఎస్పీకి తెలిపారు. పాఠశాలలోని ఆర్వో ప్లాంట్‌కు సంబంధించిన కెమికల్స్‌ ద్వారా తాగునీరు ఏమైనా కలుషితమైందా అని తెలుసుకునేందుకు డీఎంహెచ్‌ఓ పాఠశాలను సందర్శించారు. తాగునీటిని బాటిల్‌లో తీసుకుని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. మంచినీళ్ల ట్యాంక్‌లో ఉపాధ్యాయుడు రాజేందర్‌ పురుగుల మందు కలిపినట్టు గుర్తించారు. రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

నలుగురిపై సస్పెన్షన్‌
తాగునీటిలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్‌తోపాటు వేణు, సూర్యప్రకాష్‌, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు పోలీస్‌ కేసులు నమోదు చేసి రిమాండ్‌ చేస్తామని హెచ్చరించారు. విభేదాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్‌ను ప్రత్యేక అధికారులు, పోలీస్‌ సిబ్బంది తనిఖీలు చేసి విద్యార్థులతో ముఖాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం ఉదయం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాలని, పర్యవేక్షణ ఉండాలని వైద్యాధికారులను కోరారు. హాస్టల్‌ను పరిశీలించారు. వారి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad