నవతెలంగాణ-హైదరాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పాకిస్థాన్‌పై భారత్ తాజాగా విధించిన కఠిన ఆంక్షలకు ప్రతిగా ఇస్లామాబాద్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఓడరేవుల్లోకి భారత జెండా కలిగిన నౌకల (ఇండియన్ ఫ్లాగ్ క్యారియర్స్) ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది.
పహల్గామ్ దాడిలో పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటన నేపథ్యంలో ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా జాతీయ భద్రత, ప్రజా విధానాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, ఇతర దేశాల ద్వారా గానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతిని తక్షణమే నిషేధిస్తున్నట్లు భారత్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ వస్తువులపై 200 శాతం దిగుమతి సుంకం విధించినప్పటికీ, తాజా నిర్ణయంతో పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది.
దీంతో పాటు, పాకిస్థాన్ నౌకలు భారత ఓడరేవుల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించిన భారత్.. తమ నౌకలు పాక్ ఓడరేవులకు వెళ్లడాన్ని కూడా నిషేధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) తెలిపింది. ఇరు దేశాల మధ్య వాయు, భూ మార్గాల ద్వారా జరిగే మెయిల్, పార్సిళ్ల మార్పిడిని కూడా భారత్ నిలిపివేసింది.
భారత్ ఈ చర్యలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ స్పందించింది. తమ సముద్ర సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ భద్రతను కాపాడుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పాకిస్థాన్ మారిటైమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వింగ్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు పాకిస్థాన్ వార్తాపత్రిక ‘డాన్’ నివేదించింది. “భారత జెండా కలిగిన నౌకలు పాకిస్థానీ ఓడరేవులకు రావడాన్ని నిషేధిస్తున్నాం. అలాగే పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలు భారత ఓడరేవులకు వెళ్లవు. ఏదైనా మినహాయింపు అవసరమైతే, కేసును బట్టి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం” అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్లు డాన్ తెలిపింది.
భారత నౌకలను నిషేధించిన పాకిస్థాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES