Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసమస్యలపై ఉపాధ్యాయుల సమరభేరి

సమస్యలపై ఉపాధ్యాయుల సమరభేరి

- Advertisement -

హైదరాబాద్‌లో మహాధర్నాకు వేలాది మంది టీచర్ల రాక
ప్రభుత్వం పరిష్కరించకుంటే మరో ఉద్యమం
యూఎస్‌పీసీ నేతల హెచ్చరిక పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా : కోదండరామ్‌
ధర్నాకు ఎక్కువ మంది వస్తే మార్పునకు సంకేతం: నాగేశ్వర్‌
అంతరాలు లేని విద్య అందించాలి : నర్సిరెడ్డి
అక్టోబర్‌ 12న లక్ష మందితో చలో హైదరాబాద్‌ : జగదీశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలం టూ ఉపాధ్యాయులు సమరభేరి మోగించారు. సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. ఇప్పటికే 20 నెలలు ఓపిక పట్టామని అన్నారు. సమస్యలు తక్షణమే పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలుపుకోవాలని కోరారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వేలాది మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ మహాధర్నాకు యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, సిహెచ్‌ అనిల్‌కుమార్‌, ఎం సోమయ్య అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.

న్యాయమైన డిమాండ్లు : కోదండరామ్‌
ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మహాధర్నా చేపట్టారని టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ అన్నారు. పెండింగ్‌ బిల్లులు, 317 జీవో బాధితులకు న్యాయం చేయడం, ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన వంటి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత ఆర్థికేతర సమస్యలపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

పరిస్థితి చేజారకముందే ప్రభుత్వం పరిష్కరించాలి : నాగేశ్వర్‌
ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాకు ఎక్కువ మంది గుమిగూడితే అది రాజకీయ మార్పునకు దారితీస్తుందని మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ అన్నారు. పరిస్థితి చేజారకముందే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలను పిలిచి మాట్లాడాలని సూచించారు. పరిష్కరించకుంటే పోరాటమే మార్గమని ఆయన పిలుపునిచ్చారు. 33 జిల్లాలుంటే 12 డీఈవో పోస్టులనే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టుల్లేవని అన్నారు. 66 డిప్యూటీఈవో పోస్టుల్లో రెగ్యులర్‌గా ఒక్కరూ పనిచేయడం లేదని చెప్పారు. 630 మండలాలుంటే రెగ్యులర్‌ ఎంఈవోలు 16 మందే ఉన్నారని వివరించారు. పర్యవేక్షణ లేకుంటే ప్రభుత్వ బడులు ఎలా బాగుపడతాయని ప్రశ్నించారు. సీఎస్‌ లేకుంటే ఐఏఎస్‌లు పనిచేస్తారా?అని అడిగారు. పైరవీలు చేస్తే సమస్యలు పరిష్కారం కావనీ, ఉద్యమించాలని చెప్పారు. కేసీఆర్‌ ఓడిపోవడానికి 317 జీవో కూడా ఓ కారణమని అన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదో ఆలోచించాలన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలకు రూ.లక్షల ఫీజులు కట్టాల్సి వస్తున్నదని చెప్పారు.

నెలకు రూ.1,200 కోట్లు విడుదల చేయాలి : నర్సిరెడ్డి
ఈ-కుబేర్‌లో రూ.13 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిందనీ, అవి కూడా విడుదల చేయడం లేదన్నారు. పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.1,200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదనీ, దాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఖర్చు చేయడం లేదని చెప్పారు. కాకులు, గద్దలను కొట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాబందులకు వేస్తున్నదని విమర్శించారు. బ్యాంకు రుణాలను రూ.1.17 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. కానీ పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం లేదని అన్నారు. ఎన్‌ఈపీ విద్యాప్రయివేటీకరణ కోసం తప్ప ప్రభుత్వ బడుల బాగుకోసం కాదన్నారు. అంతరాలు లేని విద్యను అందరికీ అందించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల్లో అసంతృప్తి : మారం జగదీశ్వర్‌
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ అనేక హామీలిచ్చిందని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వడం తప్ప ఇతర సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. 20 నెలలు ఆగామనీ, ఇంకా ఓపిక పట్టే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అందుకే అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టామనీ, లక్ష మందితో ఎల్బీస్టేడియంలో భారీ సభను నిర్వహిస్తామని అన్నారు. ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు వచ్చేనెల ఎనిమిది నుంచి 18 వరకు జిల్లాల్లో చైతన్య సదస్సులను నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గడం ఆందోళనకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎ వెంకట్‌, ఎన్‌ తిరుపతి, టి లింగారెడ్డి, కొమ్ము రమేష్‌, ఎస్‌ హరికిషన్‌, జాడి రాజన్న, బి కొండయ్య, వై విజయకుమార్‌, జాదవ్‌ వెంకట్రావు, మేడి చరణ్‌ దాస్‌, దూడ రాజనర్సు బాబు ప్రసంగించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క, పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎల్‌ అరుణమ్మ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad