సివిల్ సర్వీసుల్లో హ్యుమానిటీస్‌ను
డామినేట్ చేస్తున్న టెక్నో చదువులు
ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో
ఇంజినీర్లు, డాక్టర్ల హవా
తగ్గుతున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య
ఉన్నత హోదాలకు దూరమౌతున్న సామాన్యులు
ట్రెండ్ మారింది బాస్!
‘యూనివర్సిటీ పేపర్‌లీక్’ ఆర్ నారాయణమూర్తి తాజా చలన చిత్రం దేశంలో సంపన్నులు, పేదల మధ్య చదువుల వ్యత్యాసాన్ని ఎత్తిచూపింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు ఒకవైపు అయితే, టెక్నో స్కూళ్లు, కార్పొరేట్ చదువులు మరోవైపు నిలుస్తున్నాయి. ఆ వ్యత్యాసం దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ ఉద్యోగాలకు ఎంపికవుతున్న అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. సివిల్ సర్వెంట్లుగా ఎంపికవుతున్నవారిలో మెజారిటీ అభ్యుర్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులు చదువుతున్నవారే కావడం గమనార్హం. ఒకప్పుడు సివిల్ సర్వెంట్స్‌గా బీఏ, బీకాం వంటి సాధారణ డిగ్రీలు, చరిత్రను బ్యాక్‌గ్రౌండ్‌గా చదివినవారు ఎంపికయ్యేవారు. ఇప్పుడు వారంతా వెనుకవరుసలో నిలుస్తున్నారు. ఐతే ఐఏఎస్ లేకుంటే ఇంజినీర్ అనే మల్టీపర్పస్ విద్యకే ప్రాథాన్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సాధారణ డిగ్రీలు, ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు సివిల్స్ సాధించలేక అవస్థలు పడుతున్నారు. ఫలితంగా ఉన్నత హోదాల్లో ఆర్థికస్థోమతతో పాటు అత్యుత్తమ శిక్షణ పొందిన వారే విజేతలుగా నిలుస్తున్నారు. ఆ ప్రభావం సమాజంపై తీవ్రంగానే పడుతోంది. మన విద్యావిధానాన్ని ప్రశ్నిస్తోంది.
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు బ్యూరోక్రసీ అందించే సేవలు చాలా కీలకం. చట్టసభల్లో ప్రభుత్వాలు చేసే చట్టాలు, విధానాలు, పథకాల రూపకల్పన, వాటి అమలులో బ్యూరోక్రాట్లదే ప్రధాన భూమిక. కేంద్రం, రాష్ట్రాల్లో రాజకీయపార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు ఐదేండ్లకోసారి మారుతుంటా యి. కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అనే ఉన్నతాధికారులు మాత్రం సివిల్ సర్వెంట్లుగా 30 నుంచి 40 ఏండ్ల పాటు పదవుల్లో ఉంటూ సేవలందిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి కీలకమైన నాలుగు స్తంభాలుగా చెప్పబడే చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియాలో వీరి భాగస్వామ్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తప్పక ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన సివిల్ సర్వీసులకు ఎంపిక కావాలని కోరుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలోనే ఉన్నారు. తీవ్రమైన పోటీ ఉండే అత్యంత కఠినమైన సివిల్ పరీక్షల్లో కొందరు మాత్రమే సివిల్ సర్వెంట్లుగా ఎంపికవుతుంటారు. అయితే ఇలా ఎంపికవుతున్నవారిలో టెక్నోక్రాట్ల (ఇంజినీరింగ్, సైన్స్, మెడిసిన్, టెక్నాలజీ) ఆధిపత్యమే నడుస్తున్నది. చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థికం, సామాజికాంశాలపై పట్టుండే హ్యుమానిటీస్ కోర్సు అభ్యర్థులు సివిల్ సర్వీసులకు తక్కువ సంఖ్యలో ఎంపికవుతున్నారు. ఒకప్పుడు బ్యూరోక్రసీలో వీరిదే ఆధిపత్యం. ఇప్పుడు దాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ప్రజాసేవ, సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండే వీరు సివిల్ సర్వెంట్లుగా తక్కువ సంఖ్యలో ఎంపికవటం ఆందోళన కలిగిస్తున్నదని మేధావులు చెప్తున్నారు.
మూడింటా రెండొంతుల మంది ఇంజినీర్లే
1980, 90లలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి సబ్జెక్టులు యూపీఎస్సీ ర్యాంకుల్లో ఆధిపత్యం చలాయించాయి. కానీ ఇప్పుడా పరిస్థితి కనబడటం లేదు. సివిల్ సర్వెంట్లుగా ఎంపికవుతున్నవారిలో మెజారిటీ వాటా టెక్నోక్రాట్లదే ఉన్నది. అందులోనూ మూడింటా రెండు వంతుల మంది ఇంజినీరింగ్ అభ్యర్థులే కావటం గమనార్హం. ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఈ అసమతుల్యతను గుర్తించింది. ఈ మేరకు సంబంధిత స్టాండింగ్ కమిటీ రూపొందించిన నివేదికను విశ్లేషించింది. సివిల్ సర్వీసు పరీక్షల్లో సాంకేతిక నేపథ్యాల నుంచి అభ్యర్థుల ఆధిపత్యం పెరగటం, ఇతర విద్యా నేపథ్యాలను కలిగి ఉన్నవారి సంఖ్య తగ్గటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
70 శాతం మంది ఇంజినీర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్
సివిల్స్ పరీక్షల్లో విజయం సాధిస్తున్నవారిలో ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉంది. 2011లో వీరి సంఖ్య 46 శాతంగా ఉంది. 2020 నాటికి 65 శాతానికి పెరిగింది. మెడికల్ నేపథ్యం కలిగినవారు 14 శాతం నుంచి నాలుగు శాతానికి పడిపోయారు. హ్యుమానిటీస్ వాటా 2011లో 27 శాతంగా ఉంటే, 2020 నాటికి 23 శాతానికి పడిపోయింది. ఇంజీనీర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్‌ను కలిపి చూసుకుంటే ఇటీవలి సంవత్సరాల్లో 70 శాతం కంటే ఎక్కువ నియామకాలు సాంకేతిక నేపథ్యాల నుంచే జరిగినట్టు అర్థమవుతోంది. బ్యూరోక్రసీలోకి ఇలాంటి ప్రొఫెషనల్స్ రావటం వల్ల దేశం మంచి నైపుణ్యమున్న ఇంజినీర్లు, డాక్టర్లు సేవలను కోల్పోతున్నదని విద్యారంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2017 నుంచి 2021 మధ్య 76 శాతం మంది అభ్యర్థులు సైన్స్ నేపథ్యం (ఇంజినీరింగ్, సైన్సెస్, మెడిసిన్) ఉన్నవారే. 23.6 శాతం మంది మాత్రమే హ్యుమానిటీస్ నుంచి ఉన్నారు.
1980 వరకు హ్యుమానిటీస్ ఆధిపత్యం
1980 వరకు ఐఏఎస్ నియామకాలలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విద్యార్హతలు కలిగినవారి ఆధిపత్యం ఉండేది. 2000-2019 మధ్య మాత్రం ఈ ట్రెండ్ మారిపోయింది. ఇంజినీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ సైన్స్ నేపథ్యం కలిగినవారు ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్‌లుగా ఎంపికవుతున్నారు. ఆర్థిక, రాజకీయ శాస్త్రాల వాటా తగ్గిపోయింది.
మేధో వైవిధ్యం ఉండాలి
పార్లమెంటరీ ప్యానెల్ గణాంకాలు భారతదేశ సివిల్ సర్వీసుల్లో మేధో వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని గుర్తు చేస్తున్నాయని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక నిపుణుల(టెక్నోక్రాట్స్) ఆధిపత్యంలో ఉండే బ్యూరోక్రసీ సామర్థ్యాన్ని అందించవచ్చు. కానీ హ్యుమానిటీస్ గ్రాడ్యుయేట్ల నుంచి పాలనకు పనికి వచ్చే సాంస్కృతిక, సామాజిక, నైతిక దృష్టిని కోల్పోయే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. సివిల్ సర్వెంట్లలో అన్ని నేపథ్యాల నుంచి అభ్యర్థులు సివిల్ సర్వీసుల్లోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు సోషల్ సైన్సెస్ (రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, ఆర్థికం, చరిత్ర), లిబరల్ ఆర్ట్స్ (ఫిలాసఫీ, సాహిత్యం,హ్యుమా నిటీస్) నేపథ్యం కలిగినవారికి సివిల్ సర్వీసు నియామకాల్లో ప్రాధాన్యతనిస్తాయన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. పాలన అంటే సామర్థ్యం ఒక్కటే కాదు… సమానత్వం, అవగాహన, దృక్కోణం కూడా అని గుర్తించాల్సిందే!
టెక్నోక్రాట్లే..బ్యూరోక్రాట్లు
- Advertisement -
- Advertisement -