– 20 కిలోల బంగారం, 1.10 కోట్ల నగదు మాయం
– చెన్నూర్ ఎస్బీఐ లావాదేవీలకు సంబంధించిన ఆడిట్‌లో గుర్తించిన అధికారులు
– ప్రధాన నిందితుడు క్యాషియర్ కోసం గాలింపు
– మరో పది మందిపై కేసు నమోదు
నవతెలంగాణ – జైపూర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నూర్ బ్రాంచ్-2లో డబ్బుల గోల్‌మాల్ వ్యవహారంలో అసలు లెక్క తేలింది. మూడ్రోజులుగా ఆడిట్ చేసిన అధికారులు చివరకు భారీ మొత్తంలో బంగారం, నగదు మాయమైనట్టు గుర్తించారు. శనివారం బ్యాంకు అధికారుల ద్వారా ఫిిర్యాదు అందుకున్న చెన్నూర్ సీఐ దేవేందర్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిందితులను పట్టుకునేందుకు నిఘా బృందాలను రంగంలోకి దించారు. ప్రధాన నిందితునిగా భావిస్తున్న బ్యాంకు క్యాషియర్ రవీందర్‌తోపాటు మరో 10 మంది అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దాదాపు రూ.12 కోట్ల 61 లక్షల విలువ గల 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.కోటి 10 లక్షలు మాయమైనట్టు బ్యాంకు అధికారులు లెక్కతేల్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 450 మంది ఖాతాదారులు బంగారం తాకట్టు పెట్టుకోగా.. గోల్‌మాల్ వ్యవహారం బయట పడటంతో వారంతా ఇప్పుడు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కష్టపడి దాచుకున్న సొమ్ము మాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఖాతాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ప్రధాన నిందితుడైన క్యాషియర్ రవీందర్ కోసం గాలిస్తున్నామని తెలియజేశారు.
డబ్బులు, బంగారం మాయం
మూడ్రోజులు పాటు ఆడిట్ జరిపిన అధికారులు ఇంత పెద్దమొత్తంలో మోసం జరగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూర్ ఎస్బీఐ-2లో ఆడిట్ చేపట్టిన అధికారులు ముందుగా 2.5 కిలోల బంగారం, రూ.80 లక్షలు మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత మూడ్రోజులు పూర్తి ఆడిట్ చేపట్టాక సుమారు కోటి 10 లక్షల నగదుతోపాటు 20 కిలోల బంగారం మాయమైనట్టు లెక్కతేల్చారు. ఈ మేరకు బ్యాంక్ అధికారులు చెన్నూర్ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.