ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఆర్సీ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని ఎస్టీయూటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న సంఘ భవనంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లయ్యిందనీ, అయినా నివేదిక బహిర్గతం చేయకపోవడం సరికాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తున్నదని అన్నారు. ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వచ్చేనెల ఒకటిన హైదరాబాద్‌లో చేపట్టే పాత పెన్షన్ సాధన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్లు తదితర బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. సర్వీస్ రూల్స్‌ను రూపొందించి, అర్హులైన ఉపాధ్యాయులకు ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్, జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని చెప్పారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను త్వరితగతిన వారి సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, రాష్ట్ర నాయకులు జుట్టు గజేందర్, నర్సింహారెడ్డి, రంగారావు, కృష్ణారెడ్డి, పోల్ రెడ్డి, బి రవీంద్ర, శీతల్ చౌహాన్‌తోపాటు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.