సీపీఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 28ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. శనివారం టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో 28 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ సీపీఎస్ నోడల్ కార్యాలయంలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రెండు నెలల్లోనే రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులను 28 జీవో ద్వారా నూతన పెన్షన్ విధానంలోకి గత ప్రభుత్వం నెట్టిందని విమర్శించారు. తద్వారా పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్నామని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి నయా పైసా ఆర్థిక భారం ఉండబోదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో ఉన్న పీఎఫ్‌ఆర్డీఏలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్ సుమారు రూ.4.6 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్లోకి మళ్లిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం సామాజిక భద్రత గురించి ఏనాడు ఆలోచించలేదన్నారు. రాష్ట్రానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దాదాపు రూ.17 వేల కోట్ల ఎన్పీఎస్ ట్రస్ట్ వద్ద ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లోనే మ్యానిఫెస్టోలోను సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము, ఉద్యోగి కంట్రిబ్యూషన్‌ను తేవాలన్నారు. 28 జీవో ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు, ప్రధాన కార్యదర్శి శ్యామసుందర్, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.