నవతెలంగాణ – బొమ్మలరామారం
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని బొమ్మలరామారం ఎస్సై శ్రీశైలం కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని గ్రామపంచాయతీలల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.
పోలీస్ స్టేషన్ లో మండల వ్యాప్తంగా గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందస్తుగా సమాచారం తీసుకుంటే మానిటరింగ్ చేయడం చాలా సులభం అవుతుందని అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి డీజేలకు అనుమతులు లేనందున నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక మండపాల దగ్గర రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లను ఉపయోగించరాదని అన్నారు.ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో శాంతి కమిటీ నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.