No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeదర్వాజఉద్యమ కవి మఖ్దూం మొహియుద్దీన్‌

ఉద్యమ కవి మఖ్దూం మొహియుద్దీన్‌

- Advertisement -

”పదపదవేగీతమా! పదవే నాప్రాణమా” వేయిగొంతులతో విప్లవశంఖం పూరించాడు. ఫాసిజంపై కణకణమండే అగ్నికవితాస్త్రాలను సంధించాడు.
అధ్యాపకునిగా, కార్మికనాయకునిగా, శాసనసభ్యుడిగా అన్నిటికీమించి ప్రగతిశీలకవిగా, రచయితగా, నాటకకర్తగా బహుముఖీనమైన పాత్ర పోషించిన మఖ్దూం ఉర్దూ తెలుగు సాహిత్యాల వారధిగా వెలుగొందాడు.
”అఖిల భారత ఖ్యాతినే కాక విశ్వవిఖ్యాతి నార్జించిన డాక్షిణాత్య కవులలో మఖ్డూమ్‌ ప్రముఖుడు” అన్న దాశరథి మాటల్లో మఖ్దూం ఔన్నత్యం అర్థమవుతుంది.
”ఇది దొంగల పడకటిల్లు హంతకులకు పుట్టిల్లు/ ఇట నీతికి అనునిత్యం విధిస్తారు మరణ శిక్ష/ అహర్నిశలు మానవతను అమ్ముతారు వేలంలో” (హవేలీ – దయ్యాల మేడ అనువాదం గజ్జెల మల్లారెడ్డి) ఎనిమిది దశాబ్దాల క్రితం మఖ్ధూం రాసిన ఈ కవితకు నేటికి ప్రాసంగికత ఉంది. ఒక ఎడతెగని ఉక్కపోత దేశమంతా దావానలంలా కమ్మేస్తున్న సమకాలీన సందర్భంలో మఖ్దూం కవిత్వం ఒక తాత్త్విక ఉపశమనంగా భావించవచ్చు.
మెదక్‌ జిల్లా ఆందోల్‌ గ్రామంలో సంప్రదాయ ముస్లిం కుటుంబంలో 1908 ఫిబ్రవరి 4 మఖ్దూం జన్మించాడు. మఖ్ధూమ్‌ బాల్యం నుండి దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు. అనుక్షణం ఆకలితో యుద్ధం చేశాడు. ఒకే ఒక్క రొట్టెతోనే రోజంతా గడిపాడు. మఖ్దూమ్‌ బతుకు పుటలను తెరచి చూస్తే జీవితంలో చెలరేగిన అనేక సుడిగుండాలను ఎదుర్కొని జాతిసముద్ధరణ కోసం ఎలా నిలబడాలో అవగతమవుతుంది. సాహిత్య నిబద్ధత అలవడుతుంది.
ఒకవైపు జీవన పోరాటం, మరొక వైపు తెలంగాణ సాయుధ పోరాటం, ఇంకొక వైపు స్వాతంత్ర పోరాటం. ఈ త్రిముఖీన పోరాట సంఘర్షణలో నుండి మఖ్దూం కవిగా ఆవిర్భవించాడు. పినతండ్రి చెప్పిన రష్యావిప్లవ స్ఫూర్తి, నియాజ్‌ ఫతేపూరీ అందించిన హేతువాద భావాల ప్రభావం, ఇక్బాల్‌ సాహిత్య ప్రేరణ, కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన భావజాల చైతన్యంతో మఖ్దూం సాహిత్య వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది.
”సామ్యవాద మహానౌక నడుపుకుంటూ సాహిత్యంలోకి ప్రవేశించాడు. ఉర్దూ సాహిత్యంలోని ప్రణయ దష్టి ఆత్మాశ్రయ వైఖరి కూడా ఆయన కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఉస్మానియా హాస్టల్‌ విద్యార్థిగా ఉన్నసమయంలో ఖవ్వాలీ బాణీలో మఖ్ధూం రాసిన ‘పీలా దుశాల’ అనే కవితతో ఆయన సజన ప్రస్థానం ప్రారంభ మయింది. పచ్చ పచ్చని పొలం గట్లమీద తీయని నవ్వులు చిందిస్తూ వలపు ఒలకబోసే తెలుగు పిల్ల అందాలను, గోదావరితీరంలో మహారాష్ట్ర మహిళల సోయగాలను కూడా ఆయన రమణీయంగా కవిత్వీకరించాడు.
ఇంద్రధనస్సు నుండి ఒకింత వన్నెను స్వీకరించి, నక్షత్రాల నుండి జీవకాంతిని పరిగ్రహించి, మధుమాసము నుండి కొంత మత్తును కొల్లగొట్టి కవిత్వం రాస్తానని ప్రకటించాడు. ”బెదిరిన స్వరములను గూర్చి హదయగీతి నిర్మింతును/ మొండి రాతిలో సైతము గుండెచప్పుడుకూర్తును”. బాధితుల, పీడితుల పక్షాన నిలిచి సజన చేస్తానని ‘షాయర్‌’ కవితలో చాటిచెప్పిన మఖ్దూం ఈ సమున్నత ఆశయ సాధన కోసం తన జీవితాన్ని సాహిత్యాన్ని అంకితం చేశాడు. వర్గరహిత సమాజం కోసం ప్రగతిశీల సాహిత్య వికాసం కోసం ప్రత్యినిత్యం పరిశ్రమించాడు. ”కర్షకుల రక్త నదిలో అమీరుల సరుకు పడవ సాగుతుందని, పీనుగైన న్యాయం కాష్టంలో కాలుతుందని” ఆవేదన చెందాడు. ‘బిసాత్‌ రిఖ్స్‌’, సురఖ్‌ సవేరా, జంగె ఆజాదీ గులెతర్‌ వంటి కవితాసంపుటలను వెలువరించి ఉర్దూ సాహిత్యంపై ప్రగాఢమైన ముద్ర వేశాడు. భారతదేశ విముక్తిని ఆకాంక్షిస్తూ మఖ్దూం కవిత్వం రాశాడు. మాతదేశ ఘనకీర్తిని కొనియాడాడు.
”రక్తంతో పండించిన రంగు రంగుల పూదోటపై ఒట్టు/ రైతుల రక్తం పై ఒట్టు/ అమరుల రక్తం పై ఒట్టు/ ప్రపంచంలో సముద్రాలు ఎండిపోవచ్చు/ నదులు ప్రవహిస్తూ అలసి పోవచ్చు/ విద్యుత్‌ ప్రవాహాల వేగం స్తంభించవచ్చు/ కానీ పవిత్రమైన ఈ భూమి/ అపవిత్రుల భారాన్నిక మోయలేదు/ దేశ స్వాతంత్య్ర దీపం ఎన్నటికీ కొడి గట్టదు”
”దాయరె హింద్‌ కా వో రహ్బర్‌ తెలంగాణా/ బనారహౌ హై నయీ ఏక్‌ సహర్‌ తెలంగాణా/ బులారహౌ హై బా సిమ్తే దిగర్‌ తెలంగాణా/ వో ఇంక్విలాబ్‌ కా పై గంబర్‌ తెలంగాణా” అంటూ మఖ్దూం తెలంగాణ విప్లవ చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు .దేశానికే తెలంగాణా మార్గదర్శిగా నిలిచిందని, నవోదయాలను సష్టిస్తుందని, విప్లవ నినాదాలను పలికిస్తుందని ప్రబోధించాడు. నిజాం నిరంకుశత్వం, బ్రిటీష్‌ పాలకుల దోపిడీవిధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న పోరాటాల తీరు తెన్నులను తనగీతాల్లో మఖ్దూమ్‌ స్ఫూర్తిదాయకంగా గానం చేశాడు
కవిగా, గీతరచయితగా విమర్శకుల ప్రశంసలందుకున్న మఖ్దూం, నాటక కర్తగా కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం. ఎ చదువుతున్న సందర్భంలో ‘ఉర్దూ డ్రామా ఔర్‌ స్టేజ్‌’ అనే అంశంపై మఖ్దూం పరిశోధనచేశాడు. బెర్నార్డ్‌ షా ‘షఱఅసశీషవతీర ష్ట్రశీబరవ’ నాటకాన్ని మీర్‌ హాసన్‌తో కలిసి ‘ఘోష్‌ కె నాఖాన్‌’ పేరుతో మఖ్దూం ఉర్దూలోకి అనువదించాడు. హైదరబాద్‌లో జరిగిన ఈ నాటక ప్రదర్శన చూసిన రవేంద్రనాథ్‌ ఠాగూర్‌ మఖ్దూంను అభినదించి శాంతినికేతన్‌కి ఆహ్వానించాడు.
ముర్షదే కామిల్‌ అనే స్వతంత్ర నాటకాన్ని కూడా రాశాడు. హైదరాబాద్‌లో అభ్యుదయ రచయితల సంఘం స్థాపించడంలో మఖ్ధూం కీలక పాత్రపోషించాడు. హైదరాబాద్‌ నుండి ఢిల్లి వరకు జరిగిన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముషాయిరాలను తన కవితలతో, గజల్స్‌తో ఎరుపెక్కించాడు. సిటీ కళాశాల అధ్యాకుడిగా విద్యార్థుల్లో సామాజిక ఉద్యమోత్తేజాన్ని రగిలించాడు. కళాశాలలో ఉన్నా, కారాగారంలో ఉన్న కార్మిక ఉద్యమ నేతగా ఉన్నా మఖ్దూం తన కలం కత్తిని విడిచి పెట్టలేదు. తన సజన ఇంధనంతో ప్రజాపోరాటాలను మండించాడు. మఖ్దూం మొహియుద్దీన్‌ పాటలను కవితలను దాశరథి, సి నారాయణ రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కష్ణమూర్తి, కౌముది తదితర కవులు అనువదించి ఆ ప్రజాకవి సాహిత్య తత్త్వన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేశారు.
మఖ్ధూం కవితలను బడా నిర్మాతలు సినిమా పాటలుగా ఉపయోగించుకున్నారు. ”ఏక్‌ చెంబెలే మండ్వేతలే” సినీ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. కథలతో పాటు ఆయన ఉర్దూ కవుల గురించి, సాహిత్యం గురించి విమర్శ వ్యాసాలు రాశాడు
”కవిత్వమూ జీవితమూ కలగలిసిన సంగమం ఆయన జీవితం. ప్రజల్లో చైతన్యం సష్టించడానికి ఒక చేత్తో కవిత్వం రాస్తూ మరో వైపు ప్రజా ఉద్యమాలకు సారధ్యం వహిస్తూ జాతిని జాగతం చేసిన కవిత్వం శిఖరం మఖ్డూమ్‌” అని కవి యాకూబ్‌ అన్న మాట అక్షరాల నిజం. (ఆగస్టు 25, మఖ్దూం వర్థంతి సందర్భంగా)
డా||కోయి కోటేశ్వర రావు, 9440480274

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad