అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం పచ్చి అబద్ధాలతో కొనసాగింది. బీజేపీ పాలనా కాలంలో దేశంలో సరుకుల ఉత్పత్తి రంగం చాలాగొప్పగా పురోగమించిందని మోడీ మాట్లాడారు. కాని అంతకుముందు పదేండ్లతో పోల్చితే బీజేపీ పాలనలో వస్తూత్పత్తి రంగంలో వృద్ధి 17.5 శాతం నుండి 12.6 శాతానికి దిగజారింది! ఈ స్థాయిని మన దేశం ఎప్పుడో 1960లోనే దాటేసి ముందుకు పోయింది. మోడీ పాలనలో అక్కడి నుండి దిగజారిపోయామన్నమాట. ఇటువంటి దిగజారుడునే మన ఆర్థికవేత్తలు పరిశ్రమల మూసివేత (డీ- ఇండిస్టియలైజేషన్) అని అంటారు. పరిశ్రమలు మూతబడుతున్న ఈ దుస్థితినే ”పారిశ్రామిక రంగంలో సాధించిన గొప్ప పురోగతి” అంటూ చెప్పుకోవడం ప్రధాని మోడీకే చెల్లింది.
స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకించి ఆర్.ఎస్.ఎస్‌ను ప్రశంసలతో ముంచెత్తడం కూడా సత్యాన్ని పూర్తిగా మరుగుపరచడమే. ఆర్.ఎస్.ఎస్ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గోలేదన్న వాస్తవం అందరికీ తెలుసు. అంతేకాదు, ఒకవేళ భారతదేశానికి స్వతంత్రం వచ్చినా, ఆ దేశం తన వ్యవహారాలను తాను నిర్వహించజాలదని, మళ్లీ పాలనను నిర్వహించడానికి బ్రిటిష్‌వాళ్లనే ఆశ్రయించాల్సి వుంటుందని ఆ సంస్థ నాయకుడు ఎం.ఎస్.గోల్వాల్కర్ తన అంచనాను ప్రకటించాడు (రామ్ పునియానీ రచనల్లో దీని గురించి పేర్కొన్నారు).
ఇక మోడీ ఆర్థిక రంగానికి సంబంధించి చేసిన ప్రధాన ప్రకటన దగ్గరికి వద్దాం. అది వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి)లో ఇవ్వనున్న రాయితీలకు సంబంధించినది. 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. ఇంతవరకూ 12 శాతం శ్లాబు వర్తిస్తున్న సరుకులు ఇకముందు 5 శాతం శ్లాబులోకి వస్తాయి. అలాగే ఇప్పుడు 28 శాతం శ్లాబులో ఉన్నవాటికి ఇకముందు 18 శాతం వర్తిస్తుంది.
దీన్ని ఒక ”దీపావళి కానుక”గా చెప్పడం పాలకుల ఫ్యూడల్ భావజాలపు మానసిక స్థితిని సూచిస్తుంది. పన్నులు చెల్లించేది ప్రజలు. ఆ ప్రజల సొమ్ము నుంచే ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు సమకూరుతాయి. అటువంటి పన్నురేటును తగ్గించడం అనేది ప్రభుత్వం నుండి ప్రజలకు ఇచ్చే కానుకగా చెప్పుకోవడంతో హేతువు తిరగ బడినట్టైంది. ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు ఏవో వారి ప్రయివేటు ఆదాయాలైనట్టు మాట్లాడుతున్నారు. లూయీ -14 అనే ఫ్రెంచి రాజు ”రాజ్యం అంటే నేనే” అని ప్రకటించినట్టు ఇప్పుడు మోడీ మాట్లాడు తున్నారు. ఈ ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఇటువంటి తలకిందుల ధోరణిని తప్ప మరేం ఆశించగలం? ఆ కూటమి సీనియర్ నేతల్లో కొందరు ఆ మధ్య భారత సైన్యాన్ని ”మోడీ గారి సైన్యం” అని ప్రకటించలేదా?
ఇప్పుడు ప్రకటించిన ‘కానుక’ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు 28 శాతం శ్లాబులో ఉన్న సరుకుల నుండి జీఎస్టీగా వస్తున్న ఆదాయం మొత్తం జీఎస్టీ ఆదాయంలో కేవలం పదకొండు శాతం మాత్రమే. ఈ శ్లాబును 18 శాతానికి తగ్గించినందువలన ఇప్పుడు లభిస్తున్న ఆదాయంలో పది శాతం మాత్రమే తగ్గుతుంది. 11శాతంలో పది శాతం అంటే 1.1.శాతం అన్నమాట. అంటే దీనివలన జీఎస్టీ ఆదాయంలో కేవలం 1.1శాతం మాత్రమే తగ్గుతుంది. అదేవిధంగా 12 శాతం శ్లాబు నుండి ఐదు శాతం శ్లాబుకి తగ్గించినందువలన ఈ శ్లాబు ద్వారా వచ్చే మొత్తం జీఎస్టీ ఆదాయంలో ఏడు శాతం మాత్రమే తగ్గుతుంది. అంటే అన్ని రకాల శ్లాబుల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయంలో కేవలం 0.35 శాతం మాత్రమే తగ్గుతుంది. ఈ రెండు రకాల రాయితీలూ కలిపితే మొత్తం జీఎస్టీలో ప్రభుత్వానికి తగ్గేది కేవ లం 1.45 శాతం మాత్రమే. ఆ మేరకు ప్రజలకు మిగులుతుంది. 2024-25 లో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 22.08 కోట్లు. అందులో 1.45 శాతం అంటే రూ.32,016 కోట్లు మాత్రమే. 2024-25 సంవత్సరానికి గాను అం చనా వేసిన జీఎస్టీలో ఇది కేవలం 0.0967 శాతం మాత్రమే. దాన్ని రౌండ్‌ఫిగర్ చేసి 0.1శాతం అని అనుకుందాం.
అధికార ప్రతినిధులు మాత్రం ఈ ‘కానుక’ ఇచ్చిన ఫలితంగా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరించడానికి దారులు తెరుచుకుంటాయి అని చాలా ఊదరగొడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఈ కానుక వలన ఏ మేరకు విస్తరించే అవకాశం ఉందన్నది ఈ కానుక ద్వారా కోల్పోనున్న ఆదాయాన్ని ఏవిధంగా భర్తీ చేయబోతున్నారు అన్న అంశం మీద ఆధారపడి వుంటుంది. జీఎస్టీలో పన్ను రాయితీలిచ్చిన కారణంగా ప్రభుత్వం ఆదాయం తగ్గి, ఆమేరకు ప్రభుత్వం తన వ్యయాన్ని గనుక కుదించుకున్నట్టయితే (బడ్జెట్‌లో ద్రవ్య లోటు పెరిగిపోకుండా ఉండడం కోసం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలి) ఈకానుక వలన ఎంతమార్కెట్ విస్తరిస్తుందో, అంతమేరకు మార్కెట్ మొత్తంగా ముడుచుకు పోతుంది కూడా. నికరంగా మార్కెట్‌లో పెరుగుదల ఏమీ ఉండదు. ప్రజలపై పన్నుల భారం ఎంతమేరకు తగ్గు తుందో అంతమేరకు ప్రభుత్వ వ్యయం విద్య, వైద్యం తదితర రంగాలలో తగ్గుతుంది. అందువలన ఈ ప్రకటించిన పన్ను రాయితీలు అటు వృద్ధికీ తోడ్పడవు, అటు సంక్షేమ ఖర్చునూ పెంచవు.
ఒకవేళ ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టకుండా పన్ను రాయితీలకు ముందు ఉన్న స్థాయిలోనే దాన్ని కొన సాగించినట్లయితే, అప్పుడు ఆ మేరకు అది ద్రవ్య లోటును పెంచుతుంది. ప్రజలకు ఇచ్చిన పన్ను రాయితీల వలన ప్రజలు చేసే ఖర్చు ఆ మేరకు పెరుగుతుంది. అయితే, దాని ప్రభావం ద్విగుణీకృతంగా ఉంటుంది (సాధారణ ప్రజా నీకం చేయగల ఖర్చు పెరిగినప్పుడు వారు కొనుగోలు చేసే వినిమయ వస్తువుల పరిమాణం పెరుగుతుంది. ఆ వస్తు వులను తయారు చేయడానికి పనుల్లో కార్మికులను వినియోగించడం పెరుగుతుంది. ఈ కార్మికులు కూడా వారి ఆదా యాలను తిరిగిఖర్చు చేస్తారు. ఆ విధంగా మార్కెట్‌లో విస్తరణ రెట్టింపు, ఒక్కోసారి అంతకన్నా కూడా ఎక్కువగా జరుగుతుంది.
ఇప్పుడు ప్రకటించిన పన్ను రాయితీలు కేవలం పేదలకు మాత్రమే వర్తించవు కనుక మార్కెట్ విస్తరణ రెండు రెట్లు కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు). ఈ పెరుగు దల మన వార్షిక వృద్ధిరేటును అదనంగా 0.2 శాతం మాత్రమే పెంచగలదు. ఇది చాలా చాలా చిన్న పెరుగుదల. కేవలం జీడీపీలో 0.1 శాతం మేరకు రాయితీలను ప్రకటించి దానినే ‘దీపావళి’ కానుకగా చెప్పుకుంటూ లేని గొప్పలకు పోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లింది.
నిజంగానే ఆర్థిక వ్యవస్థను పుంజుకు నేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టైతే, అప్పుడు అది ప్రభుత్వ వ్యయాన్ని గణనీయమైన మోతాదులో పెంచవలసి వుంటుంది. మొదటి చర్యగా విద్య, వైద్యం రంగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను శిక్షణ పొందిన అభ్యర్ధులతో భర్తీ చేయాలి (ఈ ప్రభుత్వానికి పెంపుడు జంతువులుగా వ్యవ హరించే వారితో కాదు). ఇందుకయ్యే ఖర్చును భర్తీ చేయడానికి సంపద పన్నును, వారసత్వ పన్నును విధించాలి.
మనం ఇంతకాలమూ భావిస్తున్న దానికన్నా ఎక్కువ మోతాదులో సంపద అసమానతుల ఈ దేశంలో ఉన్నాయి. దేశంలోకెల్లా అత్యధిక సంపద కలిగిన ఒకశాతం సంపన్నుల వద్ద మొత్తం దేశ సంపదలో 40 శాతం వరకూ పోగుబడిందని ఇంతకాలమూ మనం భావిస్తున్నాం. కాని ఇటీవల బెర్న్‌స్టీన్ అనే ఒక అమెరికన్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రకటించిన తాజా అంచనాలు ఈ ఒక శాతం సంపన్నులు దేశ సంపదలో ఏకంగా అరవై శాతం సంపదను కలిగి వున్నారని తెలుస్తోంది. బహుశా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే సంపద అసమానతలు మన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. పైగా అవి అనునిత్యమూ మరింత పెరుగుతూనే వున్నాయి.
అందుచేత ఆర్థిక వ్యవస్థను పుంజుకునేట్టు చేయాలి అంటే ఈ సంపద అసమానతలను తగ్గించేందుకు పూనుకోవాల్సిందే.నిజానికి అసమానతలు ప్రజాస్వామిక విలువలకు పూర్తిగా వ్యతిరేకం. స్వాతంత్య్ర దినోత్సవ సం దేశం అనేది ప్రధాని తన ఆర్థిక వ్యూహాన్ని ప్రకటించడానికి ఒక మంచి అవకాశం. కాని మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి దోహదం చేసే వ్యూహాన్ని దేన్నీ ప్రకటించలేదు. చాలా అట్టహాసంగా ‘దీపావళి’ కానుకను ప్రకటించింది. దేశాభివృద్ధికి తోడ్పడే చర్యలను చేపట్టేబదులు వట్ట్టి కబుర్లతో ప్రజలను మభ్యపెట్టే ఈ ప్రభుత్వం నుండి ఇంతకన్నా ఏమి ఆశించగలం? విద్య, వైద్యం పూర్తిగా వ్యాపారమయం అయిపోయాయని, వాటి ఖరీదు బాగా పెరిగిపోయి సామాన్యులకు అందనంత ఎక్కువ అయిపోయిందని ఇటీవల ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ భగవత్ అంగీకరిం చాడు. ఈ విధంగా ఒప్పుకోవడం అంటే ఈ రెండు ముఖ్యమైన రంగాలను నిర్వహించే ప్రధాన బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని, నయా ఉదారవాద వ్యూహంలో భాగంగా ప్రయివేటీకరించడం మానుకోవాలని దానర్ధం.
అయితే మోహన్ భగవత్ మొత్తం వాస్తవంలో ఒక భాగాన్ని మాత్రమే అంగీకరించాడు. రెండో వైపు నుంచి ప్రభుత్వం నిర్వహించే విద్య, వైద్య సంస్థలను అతడి అనుచర గణంలోని గూండాలు, చట్టాన్ని అతిక్రమించేవారు ఆక్రమించుకుంటూ వాటిని ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నారు. యూనివర్సిటీలలో ఆర్.ఎస్.ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థల గూండాలు చెలరేగి అక్కడ ఎటువంటి ప్రజాస్వామిక చర్చలను గాని, స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేయడం గాని అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. కనీస అర్హతలు కూడా లేని వారిని బోధనా విభాగపు పద వుల్లో నియమిస్తున్నారు. తాము ఎంపిక చేసినవారిని రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తున్నారు. ఆ గవర్నర్లే యూని వర్సిటీలకు చాన్సలర్లుగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీల పాలనా విభాగాధిపతులుగా కూడా ఆర్.ఎస్.ఎస్ వారినే నియమిస్తున్నారు. యూనివర్సిటీల నాణ్యతను కావాలనే ఈ విధంగా నాశనం చేస్తూంటే ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని అటువంటి యూనివర్సిటీలకు ఎందుకు పంపుతారు? ప్రభుత్వ నిర్వహణలో ఉన్న యూనివర్సిటీలకు ఒకవైపు నుండి నిధులలో కోత పెట్టడమేగాక మరొకవైపు నుండి పనిగట్టుకుని మరీ వాటి నాణ్యతను దెబ్బతీయడం చూస్తున్నాం (ఇదంతా మోహన్ భగవత్‌గారి ఆధ్వర్యంలోని ఫాసిస్టు సంస్థల పుణ్యమే).
దీని ఫలితంగా విద్యారంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. వైద్య వ్యవస్థ దెబ్బతినిపోయింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి కల్పన పథకాలు దెబ్బతినిపోయాయి. 79 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈ దేశం చాలా అస్తవ్యస్థ పరిస్థితులను చవిచూస్తోంది. నయా ఉదారవాద విధానాలు, దాని పర్యవ సానంగా బలపడ్డ ఫాసిస్టు శక్తుల ఉమ్మడి ప్రభావమే ఇది. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ముప్పు గురించిగాని, దాని నుండి బైటపడే మార్గం గురించి కాని ఎటువంటి ప్రస్తావనా లేదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్