మంత్రి దామోదర రాజనర్సింహకు జాయింట్ ఫోరం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య అనుబంధ వృత్తుల రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరం ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచాల రవీందర్ నేతృత్వంలో ఫోరం నాయకులు, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ బాధ్యులు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ, అదనపు కార్యదర్శి ఆయేషాలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కౌన్సిల్ ప్రాముఖ్యతను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో పని చేసే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తప్ప మిగతా 57 రకాల వైద్య అనుబంధ వత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు రాష్ట్రాలను ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలు వెంటనే రాష్ట్రీయ కౌన్సిల్స్ ఏర్పాటు చెయ్యాలని ఉత్తర్వులిచ్చింది. దేశంలో 11 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం 2022లో చైర్మెన్, ముగ్గురు కో ఆప్షన్ నెంబర్లతో రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కానీ ఇతర ప్రొఫెషనల్ సభ్యులను కానీ, కార్యాలయాన్ని కానీ కేటాయించలేదు. చైర్మెన్‌గా నిమ్స్‌కి చెందిన డాక్టర్ విజరు కుమార్‌ను అపాయింట్ చేశారు. అయితే ఇతర సభ్యుల నియామకం కానీ కార్యకలాపాలు జరగకుండానే ఆయన కాల పరిమితి పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది అనుకున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా కౌన్సిల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి….. అని వారు కోరారు. మంత్రిని కలిసిన వారిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యులు, నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్, కౌన్సిల్ మాజీ చైర్మెన్ డాక్టర్ విజరు కుమార్, సొసైటి ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ తెలంగాణ అధ్యక్షులు దామోదర నాయుడు, ఫోరం కోశాధికారి ఎం.ఏ.వారిస్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అనితా రెగోలు ఉన్నారు.