నవతెలంగాణ – హైదరాబాద్: అనంతపురంలో ముక్కోణపు ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. సహోద్యోగి నుంచి వచ్చిన బెదిరింపులతో భయపడిపోయిన ఓ యువతి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం అనంతపురం సాయినగర్‌లోని దీపు బ్లడ్ బ్యాంకులో అరుణ్‌కుమార్, ప్రతిభాభారతి, స్వాతి (22) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. గుత్తికి చెందిన అరుణ్‌కుమార్‌తో ప్రతిభాభారతి గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. వీరితో పాటే పనిచేస్తున్న పెనుకొండ మండలం గొందిపల్లికి చెందిన స్వాతితో కూడా అరుణ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో, మొదటి ప్రియురాలికి తెలియకుండా అరుణ్, స్వాతితో రహస్యంగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు.
కొంతకాలానికి ఈ విషయం ప్రతిభాభారతికి తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె నిన్న ఉదయం 7 గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించింది. “అన్నావదిన అంటూ నా ప్రియుడితోనే ప్రేమ నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది. ఈరోజు ల్యాబ్‌కు రా, నీ సంగతి తేలుస్తా” అంటూ పరుష పదజాలంతో బెదిరించింది. ఈ ఫోన్ కాల్‌తో స్వాతి తీవ్ర భయాందోళనలకు గురైంది. సహోద్యోగి బెదిరింపులతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి తాను నివసిస్తున్న ప్రైవేటు వసతి గృహంలోని తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ తెలిపారు.