రాష్ట్ర గ్రాంట్లలో 44 శాతం కోత

44 percent cut in state grants– మొత్తం రూ.38,668 కోట్లలో
– కేంద్రం ఇచ్చింది… రూ.8,619 కోట్లు
– బడ్జెట్‌ అంచనాల్లో ఇది 22 శాతమే : 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికలో వెల్లడి
– ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా కేంద్రం మోకాలడ్డుతున్నదని మరోసారి స్పష్టమైంది. వివిధ ఆర్థిక సహాయాలు, గ్రాంట్‌లకు సంబంధించిన కోతలే ఇందుకు నిదర్శనం. పన్నుల వాటాల్లో సైతం కేంద్రం ఇదే రకమైన కోతలు విధిస్తూ వస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం, శాసససభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కేంద్ర గ్రాంట్లలో 44 శాతం తగ్గుదల నమోదైనట్టు కాగ్‌ తెలిపింది. మరోవైపు ఆ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్లు, ఇతర సహాయాల రూపంలో రూ.38,669 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటే అందులో కేంద్రం కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇదే రకంగా మిగతా అంశాల్లోనూ రాష్ట్రం పట్ల మోడీ సర్కార్‌ వివక్ష చూపుతున్నట్టు కాగ్‌ నివేదిక ద్వారా స్పష్టమైంది.
కేంద్ర గ్రాంట్‌లో 44 శాతం తగ్గుదల…
కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో ర్రాష్టాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. మొదటిది.. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా. రెండోది.. వివిధ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌. అయితే.. ఈ రెండింటిలోనూ కేంద్రం రాష్ట్రంపై వివక్షే చూపుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.38,669 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం కంటితుడుపు చర్యగా రూ.8,619 కోట్లు మాత్రమే విదిలించింది. బడ్జెట్‌ అంచనాల్లో కేంద్రం ఇచ్చింది కేవలం 22 శాతమే. రాష్ట్ర జీఎస్‌డీపీలో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఒక్కశాతం మాత్రమే. 2021-22లో రాష్ట్ర రాబడుల్లో కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ 7 శాతమే. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.15,471 కోట్లు వచ్చింది. అంటే.. 2020-21తో పోలిస్తే 2021-22వ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 44 శాతం తక్కువ. 2017-18లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.26,857 కోట్లు వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా రూ.8,059 కోట్లు, 2018-19లో రూ.29041 కోట్లు వస్తుందని ఆశించగా రూ. 8,178 కోట్లు, 2019-20లో రూ. 8177 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ. 11,598 కోట్లు, 2020-21లో రూ. 10,525 కోట్లు వస్తుందని ఆశించగా రూ. 15,471 కోట్లు, 2021-22లో రూ. 38,669 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ.8,619 కోట్లు వచ్చాయి.ఐదేండ్లలో రాబడిలో తెలంగాణ 30 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.88,824 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి 2021-22లో రూ.1,27,468 కోట్లకు చేరింది. జీఎస్‌డీపీలో రాష్ట్ర రాబడి శాతం ఆశాజనకంగా ఉందని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2017-18లో జీఎస్‌డీపీలో రాబడి శాతం 11.81 శాతంగా ఉన్నది. 2018-19లో 11.72 శాతం, 2019-20లో 10.58 శాతం, 2020-21లో 10.29 శాతం, 2021-22లో 11.10 శాతం రాబడి జీఎస్‌డీపీతో పోలిస్తే వచ్చింది.

Spread the love