నవతెలంగాణ-హైదరాబాద్: బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. బిల్లులను 3 నెలల గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించాలంటూ గతంలో జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. రాష్ట్రపతి లేవనెత్తిన 12 సందేహాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. రాజ్యాంగంలో లేని అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఇవ్వగలదని అపెక్స్ కోర్టుకు 12 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీజైఐ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, పీఎస్ నరసింహా, ఏఎస్ చందూర్‌కర్‌తో కూడా రాజ్యాంగ ధర్మసనం మంగళవారం విచారణ జరుపుతోంది.
గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను ఆపే అధికారం గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం కొంత సమస్యాత్మకమనేనని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీం ధర్మాసనం అభిప్రాయంతో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఏకీభవించారు.