నవతెలంగాణ -పెద్దవంగర
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చింత సృజన్ కుమార్, రంగు రాములు గౌడ్ అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మండల కేంద్రాల్లో బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. కరెంట్, తాగునీటి, సీసీ రోడ్లు వేయించాలని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొడకండ్ల మండల అధ్యక్షుడు ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడి ముఖేష్ గౌడ్, నాయకులు తలారి సోమన్న, జాటోత్ శంకర్, జాటోత్ వెంకన్న, బాలు, కిరణ్, గణేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.