Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeమానవిఆంక్ష‌ల నుండి పుట్టుకొచ్చిన కొత్త అవ‌కాశాలు….

ఆంక్ష‌ల నుండి పుట్టుకొచ్చిన కొత్త అవ‌కాశాలు….

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన తాలిబాన్‌ ప్రభుత్వం మహిళలపై ఆంక్షలు విధించింది. పార్కులకు వెళ్లకూడదు, జిమ్‌లకు వెళ్లకూడదు, భోజనం చేసేందుకు రెస్టారెంట్లకు వెళ్లకూడదు. చాలా ఉద్యోగాల నుండి కూడా మహిళలను తొలగించి వేశారు. చివరకు చదువుకునే హక్కును కూడా హరించి వేశారు. అది భరించలేని అమ్మాయిలు కొత్త అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తాలిబన్ల ఆంక్షలను ఎదిరించి అమ్మాయిల విద్య కోసం అమ్మాయిలే ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలన్నీ కనుమరుగయ్యాయి. చాలా మంది ఆఫ్ఘన్‌ మహిళల మాదిరిగానే సోడాబా కూడా తన దేశ తాలిబాన్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరయ్యింది. మొదట్లో చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. 2021లో తాలిబాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో తన అధికారాన్ని చేజిక్కించుకుంది. వెంటనే ఇది చేసిన మొదటి పని మహిళల పట్ల ఆంక్షలు విధించడం. పార్కులు, జిమ్‌లకు, రెస్టారెంట్లకు మహిళలు వెళ్లకూడదు. చాలా రకాల వృత్తుల్లో పని చేయడానికి ఆంక్షలు పెట్టారు. అయితే అన్నింటికంటే మించి విద్యపై నిషేధం అత్యంత దారుణంగా మారింది.
ఓ ఆశ దొరికింది
ఫార్మా కోర్సు చేస్తున్న సోడాబా కూడా తాలిబన్ల ఆంక్షలతో ఇబ్బంది పడ్డ విద్యార్థినినే. చదువుకోవాలనే కోరికతో ఆమె ఆన్‌లైన్‌లోకి వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ ఆశ దొరికింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు ఉచిత కంప్యూటర్‌ కోడింగ్‌ కోర్సు ఏర్పాటు చేశారు. గ్రీస్‌లో నివసిస్తున్న యువ ఆఫ్ఘన్‌ శరణార్థి సహకారంతో ఆమె తన సొంత భాష డారిలో ఆ కోర్సు నేర్చుకుంది. ‘ఒక వ్యక్తి పరిస్థితులకు (వంగి) నిలబడకూడదని, ప్రతి విషయంలో ఎదగాలని, వారి కలలను సాధించాలని నేను నమ్ముతున్నాను’ అని సోడాబా అన్నారు. ఆమె కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, వెబ్‌సైట్‌ డెలవలప్‌మెంట్‌ను నేర్చుకోవడం ప్రారంభించింది. ‘నేను చేసిన ప్రయాణం నా విశ్వాసం, స్పష్టతను తిరిగి పొందడానికి నాకు సహాయపడింది. ఈ ప్రయాణంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని 24 ఏండ్ల ఆ యువతి చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె తన అసలు పేరును బయటపెట్టలేకపోయింది. ఈ కోర్సులు ఆఫ్ఘన్‌ గీక్స్‌లో భాగం.
ఏమీ తెలియకపోయినా…
25 ఏండ్ల ముర్తాజా జాఫారి సృష్టించిన సంస్థ ఇది. ఆమె కొన్నేండ్ల కిందటే టర్కీ నుండి టీనేజ్‌ శరణార్థిగా గ్రీస్‌కు చేరుకుంది. ఏథెన్స్‌లోని ఒక ఆశ్రయంలో నివసించిన తర్వాత జాఫారి కంప్యూటర్‌ కోడింగ్‌ కోర్సులో చేరడానికి ఒక ఉపాధ్యాయుడి నుండి సహాయం పొందింది. ఆమెకు కంప్యూటర్ల గురించి ఏమీ తెలియదు. దాన్ని ఎలా ఆన్‌ చేయాలో కూడా తెలియదు. కోడింగ్‌ అంటే ఏమిటో అసలే తెలియదు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కు అవసరమైన ఇంగ్లీష్‌ మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. ‘నాకు ఇంగ్లీష్‌ గురించి తెలియదు. గ్రీకు, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది నాకు చాలా కష్టంగా ఉంది’ అని చెప్పింది. కానీ చాలా నెలల తర్వాత ఆమె తన సర్టిఫికేట్‌ సంపాదించింది.
కొత్త ప్రపంచాన్ని తెరిచింది
కోడింగ్‌ ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచింది. కొన్నేండ్ల కిందట ఆమె ఆఫ్ఘన్‌ గీక్స్‌ను స్థాపించింది. తన దేశంలోని మహిళలకు సహాయం చేయడానికి, విదేల్లో ఒంటరిగా ఉన్న తనకు లభించిన సహాయానికి కృతజ్ఞతగా గత డిసెంబర్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందించడం ప్రారంభించానని ముర్తాజా చెప్పారు. ‘నా ప్రధాన లక్ష్యం సమాజానికి, ముఖ్యంగా ఆఫ్ఘన్‌ మహిళలకు, నేను ఇతర వ్యక్తుల నుండి పొందిన సహాయాన్ని తిరిగి ఇవ్వాలి. జ్ఞానాన్ని పంచుకోవడం అనేది ఎవరిలోనైనా ఓ మంచి మార్పును తీసుకొస్తుంది. నేను దాన్ని పంచుకుంటే, అది మరింత విస్తరిస్తుంది’ అని ఆమె ఏథెన్స్‌ డౌన్‌టౌన్‌లోని తన చిన్న వన్‌-రూమ్‌ ఫ్లాట్‌లో కూర్చుని చెప్పింది. మూర్తాజా నడుపుతున్న సంస్థలో ఇప్పుడు బిగినర్స్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌ అనే మూడు తరగతులలో 28 మంది ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా విద్యార్థులు ఉన్నారు.
వివిధ దేశాల్లోనూ…
బోధనతో పాటు తన విద్యార్థులకు వారి కొత్త నైపుణ్యాలను ఉపయోగించి ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు పొందడంలో కూడా మార్గదర్శకత్వం వహిస్తుంది. దాదాపు అన్ని వృత్తులు నిషేధించబడిన దేశంలోని మహిళలకు ఆన్‌లైన్‌ పని అవకాశం ఒక జీవనాధారంగా మారింది. అత్యంత అర్హత కలిగిన వారు ఆఫ్ఘన్‌ గ్రీక్స్‌లో తన బృందంలో చేరారు. ఇది వెబ్‌సైట్‌ అభివృద్ధి, చాట్‌బాట్‌ సృష్టి సేవలను కూడా అందిస్తుంది. తనకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూరప్‌ నుండి అనేక మంది క్లయింట్లు ఉన్నారని ఆమె అంటుంది.
బెదిరింపులు వచ్చినా…
ఏడాదిన్నర కిందట విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే కల చెదిరిపోయిన జుహాల్‌ అనే యువ ఆఫ్ఘన్‌ మహిళ, ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌తో కలిసి మహిళల కోసం ఆన్‌లైన్‌ అకాడమీని ప్రారంభించింది. ఐదుగురు వ్యక్తుల బృందంగా ప్రారంభమైన అది ఇప్పుడు 150 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు 4,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని ఆమె చెప్పారు. ‘మేమందరం జీతం, మద్దతు లేకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము’ అని 20 ఏండ్ల యువతి పంచుకుంది. అకాడమీపై బెదిరింపులు వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు భయపడి ఆమె మారుపేరును ఉపయోగించుకుంటుంది. ‘మా ఏకైక లక్ష్యం బాలికలకు ఉచిత విద్యను అందిం చడం. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిశోధనలను పెంపొందిం చడం’ అని ఆమె చెబుతుంది. అకాడమీ ఇప్పుడు విజన్‌ ఆన్‌లైన్‌ విశ్వవిద్యాలయం, మనస్తత్వశాస్త్రం, విదేశీ భాషల నుండి ఖురాన్‌ అధ్యయనాలు, నర్సింగ్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌ వంటి అనేక అంశాలలో కోర్సులను నిర్వహిస్తోంది.
నిధుల కొరతతో…
‘విద్యా నిషేధం అమలులోకి వచ్చినప్పుడు నేను నిరాశకు గురయ్యాను. పాఠశాల లేదు, విశ్వవిద్యాలయం లేదు, కోర్సులు లేవు. అది నన్ను నిజంగా ప్రభావితం చేసింది’ అని జుహాల్‌ అన్నారు. అప్పుడు నేను (నాలో) ఇది పరిష్కారం కాదని అనుకున్నాను. నేను నిరాశకు గురైతే, అది నాకు, ఇతర అమ్మాయిలకు సహాయపడదు. నేను నా చదువును వదులుకోకూడదు. నా దేశంలోని అమ్మాయిల కోసం నేను ఏదైనా చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె అమెరికన్‌ ఆన్‌లైన్‌ విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ ఆఫ్‌ ది పీపుల్‌ ద్వారా కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీని అభ్యసిస్తోంది. అయితే నిధుల కొరతతో ఆమె తన ఇంటర్నెట్‌ సేవను భరించడానికి ఇబ్బంది పడుతోంది. ‘కానీ నాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి నేను దీన్ని చేస్తున్నాను. నా లక్ష్యం బాలికలకు మద్దతు ఇవ్వడం. నేను దాన్ని ఆపివేస్తే 4,000 నుండి 5,000 మంది బాలికలు మళ్ళీ నిరాశకు గురవుతారు’ అంటూ ఆమె పంచుకుంది.

– సలీమ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad