Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఉద్యోగోన్నతుల కోసం2012 బ్యాచ్‌ ఎస్‌ఐల నిరీక్షణ

ఉద్యోగోన్నతుల కోసం2012 బ్యాచ్‌ ఎస్‌ఐల నిరీక్షణ

- Advertisement -

– ఖాళీలు లేవనే సాకుతో కాలయాపన
– కొన్ని విభాగాల్లో అనేక పోస్టులు భర్తీ చేయకపోవడమే కారణం


నవతెలంగాణ- బోడుప్పల్‌
రాష్ట్ర పోలీస్‌ శాఖలో అరుదైన పరిస్థితి నెలకొంది. 2012 బ్యాచ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐలు) ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 13 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, వారిలో వందలాది మందికి ఇప్పటికీ ప్రమోషన్లు లేక తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రమోషన్‌ అనేది వారికి ఆత్మగౌరవ సమస్య అయింది. ”ఖాళీలు లేవు” అని కారణం చెబుతూ, కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి, మిగిలిన వారిని పక్కన పెట్టడం పట్ల తోటి ఎస్‌ఐలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2012 బ్యాచ్‌కు సంబంధించి 360 మంది ఎస్‌ఐలు ఉండగా 60 మందికి మాత్రమే ప్రమోషన్లు లభించాయి. మిగతా 300 మందికి ప్రమోషన్లు రాకపోవడంతో వారు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. మిగిలినవారి విషయంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు నిలిచిపోవడంతో వారిలో ఉత్సాహం, పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసలుకే ఎసరు.. ఆత్మగౌరవం పట్టించుకోరూ..?
ప్రమోషన్ల సమస్యను పలుమార్లు ప్రతిపాదించినా, కేడర్‌ రివ్యూ-ఖాళీల లభ్యత పేరుతో ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారని ఎస్‌ఐలు ఆరోపిస్తున్నారు. ఒకేసారి ఎంపికైన తమలో కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి మరికొందరికి మొండిచేయి చూపడం పోలీసువర్గాలకే కాక సమాజానికీ నష్టం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు ఉద్యోగం ఎప్పటికీ ఒత్తిడి, మానసిక భారంతో కూడినదే. అలాంటి వాతావరణంలో ప్రజలకు భరోసా కల్పించే స్థాయికి వచ్చిన ఎస్‌ఐలకు సకాలంలో ఉద్యోగోన్నతులు లభించకపోతే, అది మొత్తం పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, ఉత్సాహాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, 2012 బ్యాచ్‌ ఎస్‌ఐల ఆత్మగౌరవ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, పోలీస్‌ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని పోలీసువర్గాలు కోరుతున్నాయి.

ఖాళీల లెక్క కాకి ఎత్తుకుపోయిందా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే అనేక విభాగాల్లో వందలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీఎన్‌ఏబీ), టీఎస్‌ ఆర్టీసీ భద్రతా విభాగం, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ), ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో 23 పోస్టులు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో 43 పోస్టులు, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌లు, రోడ్‌ సేఫ్టీ, మెట్రో భద్రతా విభాగం, డయల్‌-112 ప్రత్యామ్నాయ స్పందన వ్యవస్థ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం, రాజ్‌భవన్‌ భద్రత, రైల్వే పోలీస్‌ విభాగంతో పాటు విభాగాల వారీగా అనేక ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే ప్రమోషన్లు కూడా లభిస్తాయని పోలీసులు అంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad