– 9 లక్షల మంది రైతులకు మేలు : తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైకోర్టు తీర్పుతో సాదాబైనామాలకు శాశ్వత హక్కులు లభిస్తాయని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 9,00,894 మంది రైతులకు మేలు జరగడంతో పాటు 10లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్ జారీ అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సంపూర్ణమయితే రాష్ట్రంలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 జూన్2 కంటే ముందు తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరణలో భాగంగా అర్హులైన రైతుల నుంచి గత సర్కార్ స్వీకరించింది. మొదటి విడతలో 12,64,000 మంది రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకం చట్టం-1971 ప్రకారం అర్హులైన రైతులకు 13-బి ప్రొసీడింగ్‌లను జారీ చేయడంతో పాటు 6లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. తదనంతరం రైతుల నుంచి వచ్చిన వినతుల మేరకు సాదాబైనామాలకు మరో రెండు సార్లు దరఖాస్తులను స్వీకరించారు. 2020 అక్టోబర్ 30న ప్రభుత్వం రాష్ట్రంలో రికార్డు ఆఫ్ రైట్-2020(ఆర్‌ఓఆర్) నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. నూతన చట్టం అమల్లోకి వచ్చిన తరువాత రద్దయిన ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం సాదాబైనామాల దరఖాస్తులను ఎలా స్వీకరిస్తారనీ, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు 2020 అక్టోబర్ 29 తరువాత వచ్చిన దరఖాస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 29వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి 13-బి పత్రాలను జారీ చేయవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. తాజాగా 2020 అక్టోబర్ 30లోపు స్వీకరించిన 2,26,693 దరఖాస్తులను, అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వరకు స్వీకరించిన దరఖాస్తులను తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్ ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించవచ్చని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో 9లక్షల మంది సాదాబైనామా రైతులకు ఊరట లభిస్తుందని లచ్చిరెడ్డి తెలిపారు.