– సెన్సెక్స్ 850 పాయింట్లు ఫట్
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై మోపిన 50 శాతం అధిక టారిఫ్‌లు దలాల్ స్ట్రీట్‌కు సెగ చూపించాయి. అధిక టారిఫ్‌లతో భారత జీడీపీపై తీవ్ర ప్రభావం పడనుందనే అంచనాల్లో మంగళవారం అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 849.37 శాతం లేదా 1.04 శాతం క్షీణించి 80,786.54కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 255.7 పాయింట్లు లేదా 1.02 శాతం కోల్పోయి 24,712 వద్ద ముగిసింది. టారిఫ్‌ల ఆందోళనలతో ఉదయం నుంచే సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 81,377.39 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించగా.. ఆద్యంతం నష్టాల్లోనే సాగింది. ఒక దశలో 80,685.98 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవి చూసింది. బీఎస్‌ఈలో సన్ ఫార్మా, టాటా స్టీల్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధికంగా నష్టపోగా.. మరోవైపు హెచ్‌యుఎల్, మారుతి సుజుకి, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. లోహ, బ్యాంకింగ్, ఫార్మా, టెలికాం సూచీలు 1-2 శాతం వరకు నష్టపోయాయి.
ప్రధాన కారణాలు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే యూఎస్ నోటీసులు జారీ చేసింది. దీంతో టారిఫ్‌ల ప్రభావం అధికంగా ఉండే రంగాల్లో ఆందోళన నెలకొంది. అధిక టారిఫ్‌లు ముఖ్యంగా టెక్స్‌టైల్స్, జ్యువెలరీ, ష్రింప్, ఫర్నిచర్ వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వరుస రిపోర్టులు వస్తోన్న విషయం తెలిసిందే. ఇది జిడిపిని 6 శాతం దిగువకు నెట్టవచ్చని.. దీంతో భారీగా ఉద్యోగాలు తగ్గొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఫెడ్ గవర్నర్‌ను ట్రంప్ తొలగించడంతో అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. అటు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లో నమోదయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌ను ట్రంప్ తొలగించడం చరిత్రలో మొదటిసారి జరిగిన సంఘటన. ఇది ఫెడ్ స్వతంత్రతకు ముప్పు కలిగించి, అమెరికా మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. దీంతో డౌజోన్స్, ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2,466.24 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
దలాల్ స్ట్రీట్‌పై టారిఫ్ బాంబు
- Advertisement -
- Advertisement -