స్వీపర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

–  సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
–  నల్లగొండ జెడ్పీ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్‌
మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లను వెంటనే రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ స్కూల్స్‌ స్స్వీపర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 43వ రోజు సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా సోమవారం నల్లగొండ జెడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో కాంతమ్మకు వినతిపత్రం అందజేశారు. మహిళా స్వీపర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిప్యూటీ సీఈవో కాళ్లపై పడి వేడుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. 43 రోజులుగా ఆందోళన చేస్తున్నా, స్వీపర్ల వేతనాలు పెంచాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు కోరినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. స్వీపర్లను రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love