ఎగువ మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల
వాగులో పశువుల కాపరి నాగయ్య గలంతు, గాలింపు కొనసాగుతుంది
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రవాణా అంతరాయం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వాగులో చిక్కుకున్న రైతులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం మానేరు వాగులో చిక్కుకున్న రైతుల కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఫోన్ ద్వారా కలెక్టర్, ఎస్పి కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌కు వరద నీరు అధికంగా చేరడంతో, అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారని, దీంతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని అన్నారు.
ఈ క్రమంలో వాగు దాటుతున్న పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యాడని, ఆయన కోసం రెవెన్యూ, పోలీసు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు.
మరోవైపు మానేరు వాగులో ఐదుగురు రైతులు చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుందని, వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించేందుకు అధికారులు యత్నాలు ముమ్మరం చేస్తున్నారని అన్నారు. భారీ వర్షాల ప్రభావంతో గంభీరావుపేట పరిసర ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని మంత్రి సూచించారు. హుటాహటిన కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలికి చేరుకొని సహాయక, రక్షణ చ చర్యలు తీసుకోనున్నారని, మరి కొద్దిసేపట్లో ఎస్ డి ఆర్ ఎఫ్ టీం వస్తుందని, వాగులు చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో పంపుతామని తెలిపారు.