– గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాటుతో
– మండలంలో ఘనంగా వినాయక చవితి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం పండగ వాతావరణం నెలకొంది. అన్ని గ్రామాల్లో ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటింటా గణపతి విగ్రహాలను ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు చేసి, ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామాల్లో వాడ వాడల్లో భారీ వినాయక విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి, తాము ఏర్పాటు చేసుకున్న మండపాల్లో వివిధ ఆకృతులలో వినాయకుడిని ప్రతిష్టించి, పూజలతో యువకులు సందడి చేశారు. మండల కేంద్రం గుండా ఇతర మండల గ్రామాల్లో ప్రతిష్టించుకోవడానికి యువకులు భారీ వినాయక విగ్రహాలను వాహనాల్లో తరలించారు.
కాకా మండలంలో వినాయక ఉత్సవాలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి వినాయక మండపాల నిర్వాహకులకు సూచించారు. వినాయక మండపం ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని వారు తమ మండపం వివరాలను పోలీసులకు అందించాలని, మండపాల వద్ద కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. మండపాల వద్ద డీజీలు ఏర్పాటు చేయరాదని, రాత్రి వేళలో మద్యం సేవించిన, పేకాట ఆడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినాయక నిమజ్జనం రోజున మతసామరస్యాన్ని కాపాడుకునే విధంగా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు.
జోరు వాన కురిసిన… తగ్గని జోష్
మండలంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. పండగపూట భారీ వర్షం ప్రజలను చికాకు పరిచిన, వారి ఉత్సాహాన్ని మాత్రం తడపలేకపోయింది. వానను సైతం లెక్కచేయకుండా యువకులు, చిన్నారులు ఇండ్లలో ప్రతిష్టించుకునేందుకు వినాయక ప్రతిమలను, పూజకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేశారు. యువకులు వర్షాన్ని లెక్క చేయకుండానే వాహనాల్లో భారీ విగ్రహాలను తడవకుండా ఉండేందుకు తాటి పత్రాలు, ప్లాస్టిక్ కవర్లతో కప్పి తరలించి మండపాల వద్దకు చేర్చారు.