– పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు
– జిల్లాలో ఫ్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
– జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
నవతెలంగాణ-ఝరాసంగం
అల్పపీడనం కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గుండెపోత వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు,వంగలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమమైపోయాయి.అంతేకాకుండా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితం అయిపోయారు. నేడు వినాయక చవితి పండగ కావడంతో విద్యార్థుల సైతం ఇండ్లకే పరిమితమయ్యారు. పలుచోట్ల మోస్తారు వర్షం, ముసురు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లాకు ఫ్లాష్ ప్లాడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నీట మునిగిన పంటలు..
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పత్తి, పెసర, మినుము పంటలన్నీ నీట మునిగాయి. ఝరాసంగం మండలంలో అత్యధికంగా సాగుతున్న పత్తి పంట పొలాలలో భారీగా నీరు నిలిచిపోయింది. మండలంలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదయింది. మళ్లీ కుండ పోతే వర్షాలు కురవడంతో ప్రస్తుతం సాగవుతున్న మొక్కజొన్న, పత్తి, పెసర,మినుము,సోయా, పలు రకాల కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేవు అని రైతులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం – న్యాల్కల్ రెండు మండలాలకు అనుసంధానంగా ఉన్న ఎల్గోయి మామిడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నిజాంపేట్ 16.48,కడ్పల్ 10.00,కల్హేర్ 9.98,మనూర్ 9.53,ముక్తాపూర్ 7.38,నారాయణఖేడ్ 6.85,జిన్నారం 6.53,ఝరాసంగం 6.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.