నవతెలంగాణ-హైదరాబాద్ :మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణ గడ్చిరోలి-నారాయణపుర్ అటవీ ప్రాంతంలో జరిగింది.
గడ్చిరోలి డివిజన్‌కి చెందిన గట్టా దళాల్, కంపెనీ నెం.10 మావోయిస్టులు ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రెండు రోజుల క్రితం 19సీ-60 కమాండో యూనిట్లు, క్విక్ యాక్షన్ టీమ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అక్కడే క్యాంపులు వేసి కూంబింగ్ మొదలు పెట్టాయి.
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు సంఘటనా ప్రదేశం నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
పరిసర ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తూ భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో మీడియాతో పంచుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.