పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న టెర్రరిస్టు ఘాతుకాన్ని ఖండించడంలోనూ, విచారించ డంలోనూ దేశం ఒక్కతాటిపై నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 కుటుంబాలు, నేపాల్‌కు చెందిన ఒక కుటుంబం ఈ అమానుష హత్యాకాండలో ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయాయి. మనుషులను వారి మతం ఏమిటో నిర్ధారించుకొని మరీ హత్య చేయడం ద్వారా ఉగ్రవాదులు దేశంలో మతపరమైన విభజన తీసుకురావాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని పథకం పన్నారు. అయితే కులం, జాతి తేడాలు లేకుండా సమాజంలో అన్ని తరగతుల ప్రజలు ఈ ఘాతుకంపై అప్పటికప్పుడే తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. రాజకీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రాక్షసదాడిని ఏకోన్ముఖంగా ఎదుర్కోవాలనే సంకల్పాన్ని ప్రకటించాయి.ఈ సమయంలో కాశ్మీర్ ప్రజల ప్రతిస్పందన మరింత కీలకమైంది. ఎలాంటి మినహాయింపు లేకుండా వారు ఈ సామూహిక హత్యాకాండను ఖండించారు, నిరసన తెలిపారు. జమ్ముకాశ్మీర్‌లోని పట్టణాలన్నింట్లో హర్తాళ్లు జరిపి, దుకాణాలను మూసివేశారు. జమ్ముకాశ్మీర్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మనోభావాల్లో, రాజకీయ వ్యక్తికరణలో వచ్చిన పెద్ద మార్పును ఇది ప్రతిబింబిస్తుంది.
సైనిక ప్రతీకారమేనా?
ఈ దారుణమైన దాడికి ఎలా ప్రతిస్పందిం చాలన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందు, దేశం ముందు ఉన్న ప్రశ్న. మొదట తీసుకోవాల్సిన చర్య ఈ ఘాతుకానికి పాల్పడిన దోషులను చట్టం ముందు నిలబెట్టడం. ఇప్పటికే గుర్తించిన టెర్రరిస్ట్ ముఠాల సభ్యులను వెంటాడి ఏరివేసే పనిలో భద్రతా దళాలు ముమ్మర గాలింపు సాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్ జయప్రదంగా ముగించాలి. అయితే మరింత కీలకమైన సమస్య మిగిలే ఉంటుంది. ఎడతెగని ఈ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవటానికి ఇంకేం చేయాలి? ఈ టెర్రరిస్టు దళాలకు ఆశ్రయం కల్పిస్తూ పెంచి పోషించే పాకిస్తాన్ సైన్యాన్ని, రక్షణ యంత్రాంగాన్ని ఎలా ఎదుర్కోవాలి? పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామా దాడి, అంతకుముందు పఠాన్‌కోట సందర్భాల్లోనూ ఇలాగే జరిగింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద యంత్రాంగం పునాదిని పూర్తిగా నిర్మూలించే స్థాయిలో ఇండియా సైనిక దాడి చేయాలని ఇప్పుడు అంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో దాడులు జరగకుండా అడ్డుకోగలమని చెప్తున్నారు. భావోద్వేగాల తీవ్రతలో ఆత్మగౌరవంగల ఒక దేశం ప్రతీకారం తీర్చుకోవాలన్నది ఒక్కటే మార్గంగా కనిపించవచ్చు. అయితే దానివల్ల ఉగ్రవాదాన్ని నలిపివేయాలన్న ప్రకటిత లక్ష్యం నెరవేరుతుందా?
కాశ్మీర్ ప్రజల భాగస్వామ్యం
జమ్ముకాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థ లోపాలను పూరించుకోవడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండాలి. తీవ్ర భద్రతా వైఫల్యం వల్లనే పహల్గాం దాడి జరిగింది. టెర్రరిస్టు హింసాకాండను తిప్పికొట్టడానికి ప్రజలను సమీకరించే సానుకూల వాతావరణం ఇప్పుడు కాశ్మీర్‌లో ఉంది. సుదీర్ఘ కాలం పాటు పాలనా యంత్రాంగం సైనికీకరణ, సాధారణ నిర్బంధం కూడా అక్కడ ఉగ్రవాద హింసకాండను అడ్డుకోవడానికి ప్రధాన ప్రతి బంధకాలుగా ఉండేవి. ప్రజలను దూరం చేసే ధోరణులను తగ్గించే చర్యలను ఇప్పుడు అమలు చేయాలి. ఈ మార్గం నుంచి ఏ విధంగానూ వైదొలగరాదు. టెర్రరిస్టు గ్రూపుల్లో చేరిన వారికి సంబంధించిన పది గృహాలను ధ్వంసం చేయటం ఇందుకో ఉదాహరణ. అలాంటి సామూహిక శిక్ష పోకడలు ప్రజలను దూరం చేస్తాయి. లోయలో ప్రధాన పార్టీలన్నీ ఈ విధ్వంసాన్ని ఖండించాయి. జమ్ముకాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి ప్రజలు రాజకీయంగా భాగస్వామ్యం వహించే విధంగా చేయడం. వారి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ద్వారానే టెర్రరిస్టులను శక్తులను ఏకాకులను చేయడానికి భూమిక ఏర్పడుతుంది.
దౌత్యపరమైన చర్యలు
సరిహద్దుల ఆవల నుంచి చొచ్చుకువచ్చే సీమాంతర ఉగ్రవాద సమస్యను విస్తృతమైన పరిధిలో చర్చల ద్వారా రాజకీయ దౌత్య ఆర్థిక మార్గాలు, భద్రత పెంపు ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెనువెంటనే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. దౌత్య కార్యాలయాల స్థాయి తగ్గింపు, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం ‘స్తంభన’లో పెట్టడం వంటి చర్యలు తీసుకుంది. అయితే ఈ చివరి చర్య అమలు మాత్రం అనేక తీవ్రమైన చట్టపరమైన, దౌత్య సంబంధమైన ప్రభావాలు లేకుండా సాధ్యం కాదు.
భారత వైఖరికి మద్దతు కూడగట్టుకునేందుకు, పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు ప్రస్తుతం నడుస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగాలి. ఇది జరగాలంటే పహల్గాం దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులకు పాకిస్తాన్‌తో గల సంబంధాలకు సాక్ష్యాధారాలు సేకరించాలి. ఆర్థిక కార్యాచరణ బృందం (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్-ఎఫ్.ఎ.టి.ఎఫ్) దగ్గర భారతదేశం తన వాదన వినిపించి టెర్రరిస్టు గ్రూపులకు పాకిస్తాన్ సహా యం అందకుండా నిలుపు చేయగలగాలి. టెర్రరిస్ట్ గ్రూపులకు సహాయం చేసే విషయమై 2012 నుంచి 2022 వరకు ఒక అస్పష్ట జాబితాలో పాకిస్తాన్ పేరు ఉండేదని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ కారణంగానే పాకిస్తాన్ హఫీజ్ సయీద్ వంటి లష్కర్ నాయకులపై కొన్ని పరిమిత చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతోపాటే మరికొన్ని ఆర్థిక చర్యలు కూడా తీసుకోవడంపై ఆలోచించవచ్చు.
సర్జికల్ దాడుల ఫలితాలేంటి?
సైనిక పరంగా స్పందించడం విషయానికొస్తే ఏప్రిల్ 29న ప్రధానమంత్రి సాయుధ దళాల ప్రధాన అధికారులతో సమావేశమైన తర్వాత ‘ఎలా ఎప్పుడు ఏ లక్ష్యంతో స్పందించాలో’ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏమైనా సైనిక చర్య ఎలా ఉండాలనేది దేశ రాజకీయ నాయకత్వమే నిర్ణయించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనే లక్ష్యానికి ఏదైనా సైనిక చర్య ఉపయోగపడుతుందా అన్న అంశంపై స్పష్టత ఉండాలి. 2016 సర్జికల్ దాడులు, 2019 బాల్కోట్ వైమానిక దాడుల అనుభవం నుండి చూస్తే టెర్రరిస్ట్ గ్రూపులను దెబ్బ తీయటంలో అవేమీ పెద్ద సమర్థంగా పని చేయలేదని అర్థమైంది. కాకపోతే అవి సత్వర ప్రతీకారంతో చేశారనే విధంగా మోడీ ప్రభుత్వం చెప్పుకోవడానికి మాత్రం పనికి వచ్చాయి. అంతేకాని ఆ దాడులు ఉత్తరోత్తరా టెర్రరిస్టు హింసాకాండ జరగకుండా చేయలేకపోయాయి. ఇప్పుడు మరింత పెద్ద చర్య తీసుకోవాలని మరింత పెద్ద ఎత్తున ఆ దాడులు చేయాలనే మాట వినిపిస్తోంది. అలాంటి సైనిక చర్య వల్ల టెర్రరిస్ట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకొని దెబ్బతీయటం, నిర్మూలించటం సాధ్యమేనా అన్నది సందేహమే. వారికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ సైనిక వ్యవస్థ వత్తాసు వున్నప్పుడు రాజ్యేతర పాత్రధారులను అలాంటి చర్యలతో అణచివేయటం సందేహాస్పదమే. సైనిక చర్య పర్యవసానాలు, ప్రతీకారాలు రెండు దేశాల మధ్య సాయుధ శత్రుత్వాల పరంపరకు దారితీసే పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలి. పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ ఆ దేశంలో పాకిస్తాన్ సైన్యం పరిస్థితి మెరుగుపడటానికే దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది ప్రజల వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఈ తరహా చర్య వల్ల పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ భారతదేశం పైన పరోక్ష యుద్ధాన్ని మరింత గట్టిగా కొనసాగించేందుకు పాల్పడవచ్చు. సైనిక పరమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి.
ఆందోళనకరం
పహల్గాంలో అమానుషమైన టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఒక తాటి పైకి వచ్చిన ఈ సమయంలో కొన్ని ఆందోళనకరమైన ధోరణులు కూడా కనిపిస్తున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విషపూరితమైన విద్వేష ప్రచారం సాగుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో కాశ్మీరీ విద్యార్థులపైన, వ్యాపారులపైన బెదిరింపులకు దిగి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయి. ఆగ్రాలోని ఒక రెస్టారెంట్లో బిర్యానీ అమ్ముతున్న ముస్లిం యువకుడ్ని కాల్చివేసిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా గోరక్షకులు ఈ పని చేశారని సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకున్నారు. ఈ విధమైన విద్వేష ప్రచారాన్ని ఏమాత్రం సహించినా టెర్రరిస్టుల పథకాలకే ఊతమిచ్చినట్టవుతుంది. ఈ విధమైన విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రజల ఐక్యతను దెబ్బతీసి పక్కదోవ పట్టించే వారి పట్ల ఏ విధమైన ఉదాసీనతకు ఆస్కారం లేదు, ఉండకూడదు.టెర్రరిస్టుల హత్యాకాండకూ, వారి విద్వేషపూరిత భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం మెజారిటీ మతతత్వం పైన గాక ప్రజల సమ్యైకత పైన, లౌకిక విలువలపైన ఆధారపడి సాగాలి. టెర్రరిస్టు శక్తులను ప్రయోగించేవారి కుటిల పన్నాగాలను ఓడించడంలో భారతదేశం జయప్రదమయ్యేలా ముందుకు నడిపించేది ఈ మార్గమే.
(ఏప్రిల్ 30 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
పహల్గాం టెర్రరిస్టు ఘాతుకం..ఆ తర్వాత?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES