కొన్ని జీవితాలు నిత్యం మన కండ్లముందే కనపడుతున్నా పెద్దగా పట్టింపు ఉండదు. మన ఇండ్ల ముందు, వీధుల్లో, రోడ్ల మీద వాళ్ల బతుకులు ఎలా ఉంటాయో అనే తలపేరాదు. ఎందుకంటే అది సహజమనే భావన మన మనసులో ఉండటమే కారణం. కుల నిర్మాణ అం తస్తుల వివక్ష పనిలోనూ ఉంటుదనేది సత్యం.దాని ప్రభావం వేతనాలపై కూడా ఉంటుంది. దేశంలో నూటికి 95 శాతం పారిశుధ్య కార్మికులు దళితులు, వెనకబడిన కులాల ప్రజలే.చట్టసభల్లో గౌరవ వేతనం పేర నేతలు వారి జీతాలు పెంచుకున్నట్టు ఈ కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోరు. కనీసం వారి జీవితాలకు కనీస రక్షణ, కుటుం బాలకు జీవిత బీమా కూడా లేని దౌర్భాగ్యపు జీవితాలు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో గ్రేటర్ మున్సిపాలిటీ, మున్సిపాలిటీలు,జలమండలి,కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల్లో కలిపి సుమారుగా ఒక లక్ష అరవై ఐదు వేల మంది కార్మికులు ఉన్నారు. వీటిలో డెబ్బయి శాతం పైగా పారిశుధ్య కార్మికులు ఉంటే మిగతా ముప్పై శాతంలో వివిధ రకాల చిన్న చిన్న టెక్నికల్, పర్యవేక్షణ చేసే కార్మికులు. ఈ కార్మికుల్లో టెక్నికల్ కార్మికులకు ఒక రకమైన వేతనాలు ఉంటే అత్యంత తక్కువ వేతనాలు పారిశుధ్య కార్మికులకే. గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల కార్మికులకు ఒకే రకమైన జీతం రూ.9500 ఇస్తే మున్సిపాలిటీల్లో మాత్రం వివిధ హోదాలుగా జీతాలున్నవి. ఈనామమాత్రపు జీతాల్లో కూడా వివక్ష పారిశుధ్య కార్మికులకేనన్నది సుస్పష్టం.అదేమంటే ఆ పారిశుధ్య కార్మికుల్లో ఉండేది మెజారిటీ దళితులని చెప్పుకున్నాముగా వారి జీతం ఇంతే సరిపోతుందనే భావన అధికార వర్గాల్లో ఉండటమే.
గ్రామ పారిశుధ్య కార్మికులతో పోలిస్తే నగర పారిశుధ్య కార్మికుల జీవితాలు ఇంకా దుర్భరమైనవి. నగరం గుర్రుపెట్టి నిద్రపోతున్నపుడు వీళ్లు రోడ్లమీదకు వస్తారు. నిస్సిగ్గుగా వదిలిన వ్యర్థాలన్నిటినీ అప్పుడప్పుడూ మెడలోతు మురుగులో మునిగి శుభ్రం చేస్తారు. వరదలు సంభ వించిన సందర్భంలో అది ఎంత వేదనాభరితమో వర్ణించలేము. కొన్ని క్షణాలు మురుగుకాలువల పక్కన నడిస్తే ముక్కులు మూసుకుని పరుగులు తీస్తాం. మన మలమూత్ర విసర్జితాలను వదిలే మన ఇంటి పాయకానలు శుభ్రం చేయడానికి ముక్కుకు గుడ్డలు కట్టుకుని రోజంతా ఇబ్బంది పడతాం. అటువంటిది నిత్యం ఆ మురుగు కంపులోనే ఉండే వారి జీవితం ఎంత దుర్భరమైనది. అటువంటి ఈ మనుషుల పట్ల ప్రభుత్వాలు కనీసం మానవీయంగా ఆలోచించకపోవడం శోచనీయం. నాగరిక మనుషులుగా వారి పట్ల మనకు కనీస చింతన లేకపోవడం అమానవీయమే. అంతరిక్షం మీద నివాసాలకు అనువైన పరిస్థితుల ఏర్పాటుకోసం పరిశోధనలు చేస్తున్న ఈ దేశ శాస్త్ర సాంకేతికత పరిశోధనా సంస్థలు పారిశుధ్య నిర్వహణ కోసం ఆధునిక ఆవిష్కరణలు చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఈ సమాజంలో ఇటువంటి పనులు చేసే మనుషులు ఎప్పటికీ ఉండాలని కోరుకునే పాలకుల ఆలోచన ధోరణి కాదా? ఈ దేశంలో అణ్వాయుధాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు, వారి ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్న పాలకులు ఈ కార్మికుల కోసం మాత్రం ఆలోచన చేయడం లేదు.
పారిశుధ్య కార్మికులు సామాజికంగా, ఆర్థికంగా చితికిన అట్టడుగు ఎస్సీ,ఎస్టీ,అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన కులాలు ఉండటమనేది అధికారిక గణాంకాలే చూపిస్తున్న సాక్ష్యం. ఇక్కడ కారణమేంటని వెతికేకంటే పాలకులు ఎందుకు వీరిపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. వీరు కింది కులాలకు చెందినవారు అనే చులకనా భావమే. వీరు పనిచేసిన తర్వాత తిండి కూడా తినలేరు. అంతటి దుర్గంధం వారి చర్మాలను వదిలిపోదు. అది వారి దేహంలో ఒక భాగంలా కలిసిపోతుంది. పౌష్టిక ఆహారం ఉండదు. శ్వాసకోస వ్యాధులు,ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు అనేకం వారిని చుట్టుముడతాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల నిత్యం రోగాల బారిన పడి అత్యంత తక్కువ వయసులోనే చనిపోతున్నారు. సగటు పారిశుధ్య కార్మికుల జీవనాన్ని లెక్కగడితే అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు మించదు.ఇట్లా దౌర్భాగ్య జీవితాలను అనుభవిస్తూ సమాజాన్ని శుభ్రపరిచే బాధ్యతను నెత్తినమోస్తున్న వారి పట్ల పాలకులకు బాధ్యతలేదా అనేది ప్రశ్న. ప్రభుత్వాలు వారికి అరకొర వేతనమిచ్చి చేతులు దులుపుకుంటే పౌర సమాజంగా మనకు సంబంధమే లేదన్నట్టుగా ఉండటం బాధాకరం. చాలా ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వాలు వీరిని నియమించు కోవడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు.
నిజానికి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించుకుంటే వారికి గౌరవప్రదమైన జీవితం సామాజికంగా దక్కక పోయినా ఆర్థికంగా ఆ కుటుంబాలు నిలదొక్కుకుని వారి బతుకులు మార్చుకునే అవకాశం ఉండేది.కానీ పైన చెప్పుకున్నట్టు పాలకుల దృష్టిలో కూడా ఈపనులు ఆ కులాల మనుషులే చేయాలనే మధ్య యుగాల ఆలోచన.విధిలేక వారే చేస్తారు కాబట్టి వారిని క్రమబద్ధీ కరించరు.శాశ్వత నియామకాల కోసం ప్రకటనలివ్వరు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ముప్పై ఏండ్ల నుండి పారిశుధ్య కార్మికులుగా ఉన్నవారు కూడా ఈ పనికోసమే వారు పుట్టినది అన్నట్టు పనిచేస్తున్న వారే.ఒంట్లో శక్తి సచ్చి చేతకాకుంటే ఇంటిలో పస్తులుంటున్నారు తప్పితే గౌరవంగా ఉద్యోగ విరమణ చేసిన వారు లేరు. ఇక మున్సిపాలిటీ వంటి వాటిలో తొంభై శాతం అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కనీసం జబ్బు పడితే మంచి వైద్య సదుపాయాలు కూడా కల్పించరు.అసలు తమకు సంబంధం లేని విషయంగానే ప్రభుత్వాలు చూస్తున్నవి. ప్రజా ప్రతినిధులకు కార్పొరేట్ వైద్య సదుపాయాలు ఆగమేఘాల మీద అందుతుం టవి.ప్రభుత్వ బ్యూరోక్రాట్స్ అధునాతన వైద్యసేవలు పొందుతారు.ప్రభుత్వ ఉద్యోగులు అవసరమైన మేరకు మెరుగైన వైద్య సదుపాయాలు కనీసంగా వారి వారి హోదాలను పట్టి పొందే వీలైన ఉన్నది. కానీ ఈ కార్మికులకు అదికూడా కావాలనే దూరం పెట్టడంగా అర్థం చేసుకోవచ్చు. వారి బతుకులు అంతే, వారికి అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదన్నట్టే ఉంటుంది. జబ్బుపడి మరణిస్తే ప్రజాప్రతినిధుల కుటుంబాలకు, ఉద్యోగుల కుటుంబాలకు ఏదో రకమైన భద్రత ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి వీరి విషయంలో ఈ అశ్రద్ధ ఎందుకు? కనీసం వారి పేర ఉమ్మడి బీమా చేయించడానికి కూడా సిద్ధపడటం లేదు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని దశల వారీగా నైనా పారిశుధ్య కార్మికులతో మొదలు పెట్టీ అన్ని రకాల కార్మికులకి మెరుగైన జీతాలు ఇవ్వాలి. వారికి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా వసతులు కల్పించాలి. వారికి నిత్యం ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యా న్నందించాలి. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలి.సంక్షేమ పథకాల్లో ముందుగా వారికి ప్రాధా న్యత కల్పించాలి.పారిశుధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలి. వారికి విరమణ అనంతరం సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే వారు ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో ఉండగలరు. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుని ఒక స్థితిలో నిలబడగలవు.
దిలీప్.వి
8464030808
పారిశుధ్య కార్మికుల బతుకులింతేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES